ఈ రైతు 47 ఏళ్లుగా భూ నిర్వాసితుడే!

12 Nov, 2017 03:50 IST|Sakshi

     కోల్పోయింది 54 గుంటల భూమి.. 

    43 ఏళ్ల తరవాత ఇచ్చింది 36 గుంటలు 

     అది కూడా పనికిరాని, సాగు యోగ్యం కానిదే..! 

     లక్షల్లో అప్పులు.. దయనీయంగా రైతు పరిస్థితి 

ఖానాపూర్‌: సదర్‌ మాట్‌ కాల్వ కోసం ఓ రైతుకు చెందిన భూమి 54 గుంటలు తీసుకున్నారు.. పోరాట ఫలితంగా 43 ఏళ్ల తర్వాత 36 గుంటల భూమిని ఇచ్చారు. ఇచ్చిన భూమి సాగుకు యోగ్యం లేకపోవటంతో ఆ రైతు కుటుంబం 47 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉంది. నిర్మల్‌ జిల్లా ఖానా పూర్‌ మండల దిలావర్‌పూర్‌కి చెందిన చాకలి అలాల గంగారాంకు గ్రామ శివారు లోని ఎల్లాపూర్‌లో సర్వే నంబరు 243, 244, 247 లలో 54 గుంటల సారవంతమైన భూమి ఉండేది. 1970లో సదర్‌ మాట్‌ కాల్వ ఆధునీకరణ పనుల్లో గంగారం భూమిని ప్రభుత్వం తీసుకొంది.  

భూమిని ప్రభుత్వం తీసుకుంటే రోడ్డు మీద పడతామని గంగారం కుటుంబ సభ్యులతో కలసి ధర్నా చేశాడు. అప్పటి అధికారులు, పోలీసులు ఒప్పించి.. అం తకు రెండింతలు భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అధికారులు పట్టించుకోలేదు. 2013లో న్యాయ సేవాధికార సం స్థను ఆశ్రయించాడు. స్పందించిన న్యాయ స్థానం రైతుకు న్యాయం చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో 43 ఏళ్ల తర్వాత 43 గుంటల భూమిని ఇచ్చారు. అది సాగుకు పనికి రాకపోవటంతో బీడుగా పెట్టాడు. గంగారంనకు ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. భూమి కోసం అధికారుల, కోర్టు చుట్టూ తిరిగేందుకు లక్షల్లో అప్పు చేశాడు. చేతిలో చిల్లిగవ్వ లేని స్థితిలో పిల్లలనూ చదివించలేకపోయాడు. బిడ్డల పెళ్లిళ్ల కోసం అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు.

ఇప్పటికైనా ఆదుకోవాలి 
ఇటు భూమి పోయింది.. సర్కారు ఇచ్చిన భూమి వ్యవసాయానికి పనికిరాకుండా పోయింది. ఇంట్లో ఉన్న బంగారం అమ్మి.. అప్పు చేసి పోరాటం చేస్తున్నా.. అయినా న్యాయం జరగటం లేదు. నా భార్య గంగవ్వ హైబీపీతో మెదడు నరాలు చిట్లి మంచం పట్టింది. నేను ముసలోడినయిపోయా.. గంగవ్వ మందులకు నెలకు రూ. 2 వేలు ఖర్చు అవుతోంది. తిండికి కూడా తిప్పలైతాంది. పింఛన్‌ కూడా ఇత్తలేరు. ఇప్పటికైనా న్యాయం చేయాలి.  
      – చాకలి అలాల గంగారాం, రైతు, దిలావర్‌పూర్, మం:ఖానాపూర్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా