ఆ ఒక్కసారీ తప్ప..

7 Nov, 2018 01:53 IST|Sakshi

అచ్చంపేట: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి గెలుపొందే అభ్యర్థికి చెందిన పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పార్టీలు నమ్ముతాయి. ఒక్క 2009 ఎన్నికల్లో తప్ప ప్రతిసారి ఇదే సెంటిమెంట్‌ పునరావృతమైంది. 1962 నుంచి ఇప్పటి వరకు 12 సార్లు ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. 2009 ఎన్నికల్లో మాత్రం అచ్చంపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.రాములు గెలుపొందారు. కానీ, రాష్ట్రంలో మాత్రం డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇది తప్ప మిగతా అన్నిసార్లు ఇక్కడ గెలిచిన అభ్యర్థి పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ సెంటిమెంటును బలంగా నమ్ముతున్న స్థానిక పార్టీలు.. అచ్చంపేటలో తమ అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. 

‘నెల’ మంత్రి
‘నెలరాజు’ అంటే చంద్రుడని తెలుసు. మరి, ‘నెల మంత్రి’ అంటే.. ఇది చదవండి. హైదరాబాద్‌కు చెందిన రామస్వామి 1983లో మహరాజ్‌గంజ్‌ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీచేసి గెలుపొందారు. అనంతరం ఆ పార్టీలో సంక్షోభం తలెత్తడంలో ఆయన నాదెండ్ల భాస్కరరావు పక్షాన చేరారు. నాదెండ్ల మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో నాదెండ్ల ప్రభుత్వం నెల రోజులు మాత్రమే మనుగడలో ఉంది. ఆ తరువాత ప్రభుత్వం మారడంలో రామస్వామి మంత్రి పదవి కోల్పోయారు. దీంతో ఆ రోజుల్లో రామస్వామిని హైదరాబాద్‌లో అందరూ ‘నెల రోజుల మంత్రి’ అని పిలిచేవారట.  

మరిన్ని వార్తలు