కోడ్‌.. కూసింది!

11 Mar, 2019 03:56 IST|Sakshi

సాఫీ ఎన్నికలకు ఏకాదశ సూత్రాలు

సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో నేటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి లేదా కోడ్‌ అమల్లోకి వచ్చేసింది. ఎన్నికల సందర్భంగా చేసే ప్రసంగాలు మొదలుకొని అధికారంలో ఉన్న పార్టీలు ఎలా నడచుకోవాలి? అన్న అంశం వరకూ ఈ ప్రవర్తన నియమావళిలో పొందుపరిచింది ఎన్నికల కమిషన్‌. స్వాతంత్య్రం తరువాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటివరకూ పరిస్థితులకు అనుగుణంగా వీటిల్లో అనేక మార్పులు, చేర్పులు జరిగాయి. రాజకీయ పార్టీలన్నింటి సలహా, సూచనలతో రూపొందించిన ఈ కోడ్‌ ప్రధాన ఉద్దేశం మత ఘర్షణలు, అవినీతి కార్యకలాపాలకు చెక్‌ పెట్టడమే. విద్వేష పూరిత ప్రసంగాలతో నేతలు కొందరిని తమవైపు తిప్పుకోకుండా.. ఓటింగ్‌ సరళిని ప్రభావితం చేసేలా అలవికాని హామీలు, పథకాలు ప్రకటించకుండా నిరోధించేందుకు.. ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలకు సమాన అవకాశం కల్పించేందుకు రూపొందించిన ఆ ఏకాదశ సూత్రాలు స్థూలంగా...

1. ప్రభుత్వ విభాగాలేవీ ఉద్యోగ కల్పనకు సంబంధించిన ప్రక్రియ చేపట్టరాదు.
2.     పోటీ చేస్తున్న వారు, వారి ప్రచారకర్తలు ప్రత్యర్థుల, జనసామాన్యం వ్యక్తిగత జీవితానికి గౌరవమిస్తూ.. అందుకు భంగం కలిగించేలా రోడ్‌ షోలు, ప్రదర్శనలు నిర్వహించరాదు.
3. ప్రచార ర్యాలీలు, రోడ్‌ షోలు.. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు.
4.     మద్యం పంపిణీకి పార్టీలు, నేతలు దూరంగా ఉండాలి.
5.     అధికారంలో ఉన్న పార్టీలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కొత్త సంక్షేమ కార్యక్రమాలేవీ చేపట్టకూడదు. రహదారుల నిర్మాణం, ప్రారంభోత్సవాలు మొదలుకొని మంచినీటి సౌకర్యం కల్పించడం వరకూ.. ఎలాంటి కొత్త కార్యక్రమాలు చేపట్టరాదు.
6.     ప్రభుత్వ అతిథిగృహాలు, బంగ్లాలు, సమావేశ స్థలాలు, బహిరంగ ప్రదేశాలను బరిలో ఉన్న అభ్యర్థులందరూ సమాన ప్రతిపత్తిపై ఉపయోగించుకోవచ్చు. కొంతమంది పోటీదార్లు మాత్రమే వీటిపై గుత్తాధిపత్యం చెలాయించే వీల్లేదు.
7. పోలింగ్‌ రోజు బరిలో ఉన్న అభ్యర్థులందరూ పోలింగ్‌ సాఫీగా జరిగేందుకు అధికారులకు సహకరిచాలి. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎన్నికల చిహ్నాలను ప్రదర్శించకూడదు. ఎన్నికల కమిషన్‌ ఇచ్చే ప్రత్యేక అనుమతి పత్రం ఉన్న వారు మాత్రమే పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించేందుకు అర్హులు.
8.    ఎన్నికలకు సంబంధించిన ఏ అంశంపైనైనా ఫిర్యాదులు స్వీకరించేందుకు ఎన్నికల పరిశీలకులు అందుబాటులో ఉంటారు.
9.     ప్రచారం కోసం అధికారంలో ఉన్న పార్టీలు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించకూడదు.
10.    అధికార పార్టీల తాలూకూ మంత్రులు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కాకూడదు. ఇది ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉండటం గమనార్హం.
11. ప్రచారం కోసం వాడే లౌడ్‌ స్పీకర్లకు స్థానిక అధికారుల నుంచి ముందస్తుగా లైసెన్సు, అనుమతి పత్రాలు తీసుకోవాలి. ఇది అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు వర్తిస్తుంది. బరిలో ఉన్న అభ్యర్థులు తమ ర్యాలీల గురించి ముందుగానే పోలీసులకు సమాచారం అందించాలి.
 

4 రాష్ట్రాలు

మరిన్ని వార్తలు