చంద్రబాబు నక్క జిత్తులను ప్రజలు నమ్మరు

6 Nov, 2018 08:26 IST|Sakshi

అక్రమ మైనింగ్, భూకుంభకోణాలతో  టీడీపీ నేతలు దోచుకుంటున్నారు

చంద్రబాబు ఏజెంట్‌గా పోలీసుబాస్‌

గిరిజనుల అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధకాండకు ప్రభుత్వానిదే బాధ్యత

లేఖ విడుదల చేసిన ఏవోబీ ఎస్‌జెడ్‌సీ అధికార ప్రతినిధి జగబంధు

పాడేరు రూరల్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు నక్క జిత్తులను ప్రజలు నమ్మరని ఏవోబీ ఎస్‌జెడ్‌సీ మావోయిస్టు అధికార ప్రతినిధి జగబంధు పేర్కొన్నారు. విశాఖ ఏజెన్సీలో ప్రస్తుతం కొనసాగుతున్న గిరిజనుల అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధకాండకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం పాడేరులో మరో 5 పేజీల లేఖ విడుదల చేశారు.

లేఖలోని సారాంశం... ‘ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న నిర్బంధ పద్ధతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వస్తి పలికాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతానని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు నక్క జిత్తులను ప్రజలు నమ్మరు. ఏజెన్సీలో కూంబింగ్‌ల పేరుతో గ్రామాల మీద ప్రభుత్వం దాడులు చేయిస్తోంది. యువకులను బెదిరించి ఎత్తుకెళ్లి తప్పుడు కేసులు బనాయించి హింసిస్తున్నారు. ఇళ్లలోకి ప్రవేశించి తిండి గింజలను ధ్వంసం చేస్తున్నారు. అడవిని నమ్ముకున్న అడవి బిడ్డలు అదే అడవికి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు తెచ్చారు. జి.మాడుగుల మండలం రాసరాయి గ్రామంలో అక్టోబర్‌ 26న అర్ధరాత్రి దాడి చేసి నలుగురు గిరిజనులను పట్టుకెళ్లిపోయారు. అడ్డుపడిన మహిళలను చితకబాదారు. మరో ఘటనలో అక్టోబర్‌ 15న బూతం అన్నపూర్ణ, మరో గిరిజనుడు  సింహాచలంను అరెస్టు చేశారు. అన్నపూర్ణ గతంలో ఉద్యమంలో పనిచేసి అరెస్టు అయి బెయిల్‌పై వచ్చి ఇంటి నుంచే కోర్టుకు హాజరవుతున్నారు. వారు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నారని గత ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అబద్ధాలు చెప్పారు. పోలీసు అధికారులు గంజాయి వ్యాపారుల నుంచి లంచాలు తీసుకుంటూ మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. గంజాయి లంచాల గొడవల కారణంగానే 2016లో ఏఎస్పీ ఆత్మహత్య చేసుకున్న విషయం ప్రజలు మరువలేదు. చంద్రబాబు ఏజెంట్లుగా మారిన పోలీసులు నిజాన్ని ఒప్పుకునే నిజాయితీ, ధైర్యం ఏనాడో కోల్పోయారు. హుకుంపేట, అనంతగిరి మండలాలు మినహా ఏజెన్సీలోని అన్ని మండలాల్లో అమాయక గిరిజనులకు అరెస్టు చేశారు. ఏ మండలంలో గిరిజనులపై నిర్బంధకాండ జరుగుతుందో ఆ మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు మూల్యం చెల్లించుకోక తప్పదు. 

కుంభకోణాలు ఏమయ్యాయి?
విశాఖలో భూముల కుంభకోణం, కాల్‌మనీ కుంభకోణం వంటి అంశాలు ఏమయ్యాయి? నీరు చెట్టు పేరుతో దళితుల భూములను ఆక్రమించుకున్నారు. చట్టాలను ఉల్లంఘించి లేటరైట్, గ్రానైట్, చైనా క్లే, రంగురాళ్ల తవ్వకాలు జరిపి దోచుకుంటున్నారు. ఈ మొత్తం చర్యలు, పాలసీలను కిడారి సర్వేశ్వరరావు, సీవేరి సోమ అమలు జరిపారు. ప్రజల మీద జరిగిన అణచివేత చర్యలను వారు వ్యతిరేకించలేదు. ఒకరు ప్రభుత్వ విప్‌గా, మరొకరు ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా అన్ని సౌకర్యాలూ అనుభవిస్తూ ప్రజా వ్యతిరేకులుగా మారిపోయారు. అక్రమ మైనింగ్‌ ద్వారా వందల కోట్లు సంపాదించుకునేందుకే పార్టీ మారారు. కిడారి అమాయకుడు, సొంత ఇల్లుకూడా లేని పేదవాడని ఒకవైపు డీజీపీ మెచ్చుకుంటున్నారు. వీరు ప్రజాసేవకులు కాదు.. దళారులకు, రాజకీయ ఊసరవెల్లులకు రోజూ సెల్యూట్‌ కొట్టి వారి అభిమానాన్ని పొందడానికి తహతహలాడేవారు.

మాఫియాగాళ్లకు రక్షణగా ఉంటారా?
అక్టోబర్‌ 8న పెదబయలు మండలం జమున, చిట్టంగరువు గ్రామాల మధ్య జరిగిన ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? బ్యాంకులకు వందల కోట్లు ఎగనామం పెట్టిన సుజనాచౌదరి వంటి నేరస్తులను చంద్రబాబు, డీజీపీ కాపాడుతున్నారు. ఇసుక, భూ దొంగలు, మద్యం మాఫియాగాళ్లకు రక్షణగా ఉంటున్నారు. ప్రత్యేకహోదా కోసం ఉద్యమం చేస్తున్న వారిని జైలుకు పంపించి ఇప్పుడు హోదా, ధర్మపోరాట దీక్షలంటూ నాటకమాడుతున్నారు.  ఏజెన్సీలో జరుగుతున్న నిర్బంధకాండపై అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు నోరు విప్పాలి. తెలుగుదేశం పార్టీని ఒంటరి చేసి దాని ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి. అక్టోబర్‌ 29న సీకుపనస గ్రామంలో ప్రజలు వేలాది మంది తమ నిరసనను తెలిపేందుకు సిద్ధమవుతుండగా చంద్రబాబు, పోలీసులు వాటిని జరగనివ్వకుండా చేశారు. ఇటువంటి చర్యల వల్ల ప్రజాగ్రహం చవిచూస్తారు’ అని లేఖలో హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు