పెన్నా పాపం టీడీపీదే

27 Jun, 2019 10:44 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడంతోనే పెన్నా బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తి కాలేదని,  రైతాంగానికి ఎంతో అవసరమైన ప్రాజెక్ట్‌ను ఏళ్ల తరబడి పూర్తి చేయలేకపోయిన పాపం టీడీపీదేనని ఇరిగేషన్‌ శాఖ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. నెల్లూరు పెన్నా బ్యారేజీ పనులను రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  2007లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.127 కోట్లతో పెన్నా బ్యారేజీని మంజూరు చేయడం జరిగిందన్నారు. వైఎస్సార్‌ హయాంలోనే ప్రాజెక్టు పనులు ప్రాంభమయ్యాయన్నారు. దాదాపుగా పన్నెండేళ్లు గడిచినా ఇంత వరకు ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడం సిగ్గుచేటన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేయించడంలో విఫలమైందన్నారు. చంద్రబాబు నెల్లూరుకు వచ్చిన ప్రతిసారి పెన్నా బ్యారేజీని పూర్తి చేస్తామని చెప్పడమే తప్ప, పూర్తి చేయించలేదన్నారు. గత ప్రభుత్వం సరిగా నిధులు విడుదల చేయకపోవడంతో పాటు బ్యారేజీ పనులపై నిర్లక్ష్యం వహించడంతోనే ఈ పరిస్థితి నెలకొంది.

రంగనాయకులపేట ఘాట్‌ పరిశీలన  
రంగనాయకులపేటలోని ఘాట్‌ను మంత్రి అనిల్‌కుమార్‌ పరిశీలించి పనులు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘాట్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సంతపేట మార్కెట్‌ ను పరిశీలించి వ్యాపారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో ఇరిగేషన్‌ అధికారులు,  వైఎస్సార్‌సీపీ నాయకులు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, ముక్కాల ద్వారకానాథ్, వైవీ రామిరెడ్డి  , కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్‌లోగా పూర్తి చేస్తాం
లక్షల ఎకరాలకు సాగునీరు, నెల్లూరు నగర తాగునీటి అవసరాలకు ఎంతో పెన్నా బ్యారేజీ నిర్మాణం ఎంతో అవసరమని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ అన్నారు. ప్రస్తుతం బ్యారేజీలో నీరు లేకపోవడంతో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయన్నారు. పెన్నా బ్యారేజీని వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తిచేసి అంకితం చేస్తామన్నారు.  పెన్నా బ్యారేజీ అందుబాటులోకి వస్తే  రైతులతో పాటు నగర ప్రజల తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అవినీతికి తావులేకుండా చూస్తామన్నారు. తనకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇరిగేషన్‌ శాఖ అప్పగించారని, తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలకమైన ఇరిగేషన్‌శాఖను అనిల్‌కుమార్‌యాదవ్‌కు ఇచ్చారన్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించడం కూడా జరిగిందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా అనిల్‌కుమార్‌ను అభినందించారన్నారు. త్వరతిగతిన పెన్నా బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. జిల్లా వాసుల పక్షాన మంత్రికి అభినందనలు తెలిపారు.  

మరిన్ని వార్తలు