స్నేహితుల మధ్య యుద్ధం.. గెలుపు నీదా నాదా సై..!

12 Nov, 2023 20:27 IST|Sakshi

వారిద్దరూ స్నేహితులు.. అంతేకాదు.. కుటుంబాల మధ్య కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయంగా ప్రత్యర్థులైనా ఎప్పుడూ బయటపడి ఒకరినొకరు పెద్దగా విమర్శించుకోరు. ఆ సిటీలో రాజకీయవర్గాల్లో అందరికీ తెలిసిన విషయమే ఇది. తాజా ఎన్నికల్లో కూడా వారిద్దరూ చెరో పార్టీ తరపున తలపడుతున్నారు. ఇక తప్పనిసరిగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. నామినేషన్లు ముగిసి ప్రచారం ఊపందుకోవడంతో విమర్శల జోరు పెరుగుతోంది.

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ మంచి స్నేహితులు. సామాజికవర్గ లెక్కలు వీరిద్దరినీ ఒక్కటిగా పెనవేశాయనే టాక్ ఎలాగూ ఉంది. గతంలో ఒకింత తీవ్రస్థాయిలోనే ఒకరిపై ఇంకొకరు అటాక్ చేసుకున్న వీరిద్దరూ.. ఆ తర్వాత ఒక అండర్ స్టాండింగ్‌కు వచ్చారనే అభిప్రాయం కరీంనగర్ జనంలో ఉంది. ఇక అప్పట్నుంచీ వీరిద్దరూ పార్టీల పరంగా కౌంటర్స్ విసురుకుంటారే తప్ప.. వ్యక్తిగత విమర్శలు చేసుకునే పరిస్థితి రాలేదు. ఒక సుహృద్భావమైన వాతావరణంలో రెండు ప్రత్యర్థి పార్టీల నేతలు తమ రాజకీయాలను కొనసాగిస్తున్నారు.

కానీ, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు ముందుకు రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాల్గోసారి కూడా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా.. తన చిరకాల ప్రత్యర్థినెలాగైనా ఈ సారి ఓడించి తీరాలన్న కసితో.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బరిలో నిల్చారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి మాటల యుద్ధం రకరకాల రాజకీయ చర్చలకు తావిస్తోంది.

కేబుల్ బ్రిడ్డ్ కూలిపోతోంది.. కేబుల్ బ్రిడ్జ్ రోడ్డు చూసి జనం నవ్వుకుంటున్నారు.. ముందు అది చూసుకో.. ఆ తర్వాత నీ అభివృద్ధి గురించి చెప్పుకో అంటూ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్.. మంత్రి గంగులపై కామెంట్స్ చేయడంతో ఈ రాజకీయ కాక మొదలైంది. అంతేకాదు.. గంగుల ఓడిపోతాడనే భయంతోనే కేసీఆర్ ఇంతకాలం బీఫామ్ ఇవ్వలేదంటూ కూడా సంజయ్ చేసిన కామెంట్స్.. సహజంగానే మంత్రి గంగులకు కోపం తెప్పించాయి.

దాంతో అసలు రేవంత్ పై బలి కా బక్రా అని సానుభూతి చూపించావు గానీ.. నువ్వూ, నీకోసం వచ్చిన రాజాసింగే అసలు బలి కా బక్రాలంటూ ఆయన ఘాటుగా సమాధానం చెప్పారు. కరీంనగర్ లో మూడో ప్లేస్ కే బండి సంజయ్ పరిమితం కాబోతున్నారన్నారు. అంతేకాదు.. తనకు బీఫామ్ ఇవ్వలేదనడం హాస్యాస్పదమని.. మరి నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థెవ్వరో బండి చెప్పాలన్నట్టుగా గత రెండు రోజులుగా గంగుల కౌంటర్ అటాక్ చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా అమలవుతున్న స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానిది. ఈ ప్రాజెక్టు కింద ఖర్చు చేసే నిధులను కేంద్రమే ఇస్తోంది. కరీంనగర్ స్మార్ట్‌ సిటీ నిధులు కూడా కేంద్రానివే. నగరం అందంగా తీర్చిదిద్దే పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయి. కాని బీజేపీ నేతలు ఈ విషయాన్ని ప్రజల్లో సమర్థవంతంగా చెప్పుకోలేకపోతున్నారనే టాక్ నడుస్తోంది. కాని అదే స్మార్ట్ సిటీ అభివృద్ధి కార్యక్రమాలను తమకనుకూలంగా మల్చుకుని.. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్లుతూ బీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రి గంగుల వర్గం జనంలోకి వెళ్లుతుండటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మొత్తంగా గతంలో పరుష పదజాలం వాడి నాలుక్కర్చుకుని మళ్లీ తిరిగి ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చిన ఇద్దరు మిత్రులు.. ఇప్పుడు ఎన్నికల వేళ నోటికి పని చెప్పి కౌంటర్ అటాక్స్ తో జనం మధ్య జరిగే చర్చల్లో భాగస్వాములవుతున్నారు.
చదవండి: కేసీఆర్‌కు కొత్త కష్టాలు.. గులాబీ నేతల్లో టెన్షన్‌?

మరిన్ని వార్తలు