కొంప ముంచారు!

22 Apr, 2019 12:43 IST|Sakshi

నగర టీడీపీ నేతలపై నారాయణ చిందులు

ఓటుకు నోటు పంపకాల్లో తేడాలు

ఓటర్లకు నగదు ఇవ్వకుండా నేతలు మింగేశారంటూ నిందలు

నెల్లూరు నగర నియోజకవర్గ ఓటింగ్‌పై మంత్రి నారాయణ అంతర్మథనం

‘నగర టీడీపీ నేతలు నా కొంప ముంచారు.. ఓటర్లకు ఇవ్వాల్సిన నగదులో కొంత నాయకులు మింగేశారు.. మనం వేసుకున్న ప్రణాళిక విధంగా ఓటర్లకు నగదు చేరలేదు.. నేను నమ్మిన నాయకులే నాకు వెన్నుపోటు పొడిచారు.. నేతల స్వార్థంతో నా కొంప మునిగేలా ఉంది’ అని మంత్రి నారాయణ నెల్లూరు పోలింగ్‌ సరళిపై తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. కాగా టీడీపీ నాయకులు మంత్రి నారాయణ వ్యవహార శైలిపై స్పందిస్తూ ఏరు దాటాకతెప్ప తగలేసినట్లుందని ఆరోపిస్తున్నారు. ఎన్నికలయ్యేంత వరకు తమతో పనిచేయించుకుని, ఇప్పుడు నగదు మింగేశామని నిందలు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

సాక్షి, నెల్లూరు: నెల్లూరుసిటీలో ఓటర్లకు నగదు పంపిణీ విషయంలో టీడీపీ నేతలు మోసం చేసి తన కొంప ముంచారని మంత్రి నారాయణ  అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓటింగ్‌ అయిపోయిన తర్వాత తమను అవమానించడం ఎంతవరకు సబబు? అని నగర టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది నెల్లూరు నగర నియోజకవర్గంలో మంత్రి నారాయణ, టీడీపీ నేతల మధ్య జరుగుతున్న అంతర్గత పోరు. ఎన్నికల అనంతరం పోలింగ్‌ సరళిపై అంతర్గత సమావేశంలో మంత్రి నారాయణ అయన సన్నిహితుల వద్ద నగర టీడీపీలో ఉన్న కీలక నాయకులపై చిందులు తొక్కినట్లు సమాచారం.

70 వేల మంది నగదు అందలేదని సర్వేలో వెల్లడి
తన కంటే తన డబ్బును చూసి నేతలు పనిచేశారని, ఓటుకు నోటు పంపిణీలో కొందరు నాయకుల ప్రమేయం పెట్టడంతో కొంత భాగం పంపకాలు చేయకుండా నిధులు మింగేశారంటూ నేతల తీరుపై మంత్రి నారాయణ మండిపడినట్లు సమాచారం. నగర నియోజకవర్గంలో సుమారు లక్షా యాభై వేల మంది ఓటర్లకు గాను ఒక్కో ఓటర్‌కు రూ.2 వేలు వంతున పంపకాలు చేసేందుకు మంత్రి నారాయణ నగదు సమకూర్చినట్లు తెలిసింది. అయితే అందులో సుమారు 70 వేల మంది ఓటర్లకు సక్రమంగా నగదు అందలేదని మంత్రి చేయించిన అంతర్గత సర్వేలో వెల్లడి కావడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలిసింది.  ఓటర్లకు నగదు పంపిణీ వ్యవహారంలో ఎన్నో జాగ్రతలు తీసుకుని తమ విద్యాసంస్థల ఉద్యోగుల చేత పంపిణీ చేయించాలని చూసినా కీలక నేతలు నగదు పంపిణీ వ్యవహారంలో దూరి నగదు కాజేశారని ఆయన వాపోయినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో కీలకమైన ముగ్గురు నేతలతోపాటు టీడీపీ కార్పొరేటర్లకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చానని అవి కూడా చాలదన్నట్లుగా ఓటర్లకు నగదు పంపకాల విషయంలో కూడా దూరి అందులో నగదు కూడా కాజేయడంపై ఆయన నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ కీలక నేతలను నమ్మి నట్టేట మునిగేలా ఉన్నానంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

సహకరించిన వారిపై నిందలా?
ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవం లేని మంత్రి నారాయణ ఎన్నికల బరిలో దిగినప్పుడు అన్ని విధాలా సహకరించిన తమపై నగదు కాజేశారంటూ నిందలు మోపడంపై టీడీపీ కీలక నేతలు మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్లగా పార్టీని నమ్ముకుని ఉన్న వారిని మంత్రి నారాయణ నమ్మకుండా ఓటుకు నోటు పంపిణీ వ్యవహారంలో ఆయన విద్యాసంస్థల ఉద్యోగుల చేత పంపకాలు చేయించుకుని తమపై నిందలు వేయడం ఎంత వరకు సమంజసమని వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలోమంత్రికి సహకరించినందుకు మమ్మల్ని దొంగలుగా ముద్రవేయడంపై వారు మండిపడుతున్నట్లు తెలిసింది. మంత్రి నారాయణ వ్యవహార శైలిపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా