మంత్రి పదవిచ్చి మసీదులు కూల్చుతారా?

24 Nov, 2018 12:38 IST|Sakshi
నీలం థియేటర్‌ సర్కిల్‌లో ధర్నా చేస్తున్న మైనార్టీలు

జంగాలపల్లి మసీదు ఇటుక ఒక్కటి తొలగించినా ఊరుకోం

జేసీ వచ్చినా, ఇంకొకరు వచ్చినా విస్తరణ పనులను అడ్డుకుంటాం

మైనార్టీలను కాదని ముందుకెళ్తే తెలుగుదేశం పార్టీ పతనం

అనంతపురంలో మైనార్టీల ధర్నాలో ముతువల్లి నిస్సార్‌ అహ్మద్‌

అనంతపురం న్యూసిటీ: ‘సీఎం చంద్రబాబునాయుడు మైనార్టీలకు ఓ మంత్రి పదవిచ్చి రెండు మసీదులు కూల్చుతారా? ఇదెక్కడి న్యాయం. జంగాలపల్లి మసీదుకు సంబంధించి ఒక్క ఇటుకను తొలగించినా ఊరుకునేది లేదు’ అని ముతువల్లి నిస్సార్‌ అహ్మద్‌ అన్నారు. తిలక్‌రోడ్డు, గాంధీబజార్‌ రోడ్డు విస్తరణకు నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో మైనార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం నమాజ్‌ అనంతరం పెద్ద ఎత్తున నీలం థియేటర్‌ సర్కిల్లో ధర్నా చేపట్టారు. ట్రాఫిక్‌ పెద్దెత్తున స్తంభించిపోవడంతో వన్‌టౌన్, టూటౌన్‌ పోలీసులు భారీగా మోహరించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ధర్నా విరమించాలని సీఐ విజయభాస్కర్‌ గౌడ్, రాజశేఖర్‌ ముతువల్లిని, మైనార్టీలను బతిమలాడారు. వారి కోరిక మేరకు ధర్నాను విరమించారు. ఈ సందర్భంగా ముతువల్లి నిస్సార్‌ అహ్మద్‌ మాట్లాడుతూ పైసా పైసా సేకరించి రూ.కోటితో జంగాలపల్లి మసీదు నిర్మించామన్నారు. ఇవాళ ప్రభుత్వం మైనార్టీల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా విస్తరణ పనులను కచ్చితంగా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. మైనార్టీలను కాదని విస్తరణ చేపడితే ఆ పార్టీ పతనం తప్పదని హెచ్చరించారు. కౌన్సిల్‌ తీర్మానాన్ని కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి బేఖాతరు చేస్తూ విస్తరణ చేయాల్సిందేనని ఏవిధంగా రిపోర్టు ఇస్తారని ప్రశ్నించారు. విస్తరణ చేపట్టడానికి ప్రభుత్వానికి అధికారులున్నాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారని, అలాంటప్పుడు ప్రభుత్వమే విస్తరణ చేస్తామని ఎందుకు చెప్పలేదన్నారు. ప్రభుత్వం నాటకాలాడుతోందని సీఎం చంద్రబాబునాయుడుకు తప్పక బుద్ధి చెబుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ రషీద్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ఎన్‌టీఆర్‌ మార్గ్‌ ద్వారా ట్రాఫిక్‌ మళ్లిస్తే విస్తరణ అవసరం లేదన్నారు. కానీ అక్కడి బాధితులకు నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారన్నారు. విస్తరణ చేపడితే ఊరుకునేది లేదని, టీడీపీని గద్దె దింపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు చాంద్‌బాషా, అత్తార్‌షేక్, నూర్‌మహ్మద్, మైనుద్దీన్, బాషా, గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు