సీఎం జగన్‌ను కలిసిన రోజా, నారాయణస్వామి

12 Jun, 2019 08:32 IST|Sakshi

సాక్షి,అమరావతి:  తాడేపల్లిలోని సీఎం వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో మంగళవారం పలువురు ప్రముఖులు ఆయనను కలిశారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దంపతులు, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, జి.శ్రీకాంత్‌ రెడ్డి, కాకాణి గోవర్దన్‌రెడ్డి, రాంరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి, వాసు బాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులు సీఎంని కలిసినవారిలో ఉన్నారు. భేటీ అనంతరం ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ...అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసినట్లు చెప్పారు. 

అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. తొమ్మిదేళ్లుగా వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని..  రాష్ట్రానికి రాజన్న పాలన తీసుకురావాలన్న ఆలోచనతో తామంతా పని చేశామన్నారు. అంతేకానీ పదవుల కోసం కాదని రోజా స్పష్టం చేశారు. తమ నియోజవర్గ ప్రజలకు నవరత్నాలు అందించడమే తమ ముందున్న కర్తవ్యమన్నారు. బుజ్జగింపులు, అలకలు అనేవే లేవని, మీడియా అనవసరంగా దూరం పెంచొద్దంటూ ఆమె హితవు పలికారు. వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి అయితే తామంతా అయినట్లేనని రోజా అన్నారు.

సమాచారశాఖ కమిషనర్‌గా విజయకుమార్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా తుమ్మా విజయకుమార్‌రెడ్డిని నియమించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ (ఐఐఎస్‌) 1990 బ్యాచ్‌కు చెందిన విజయకుమార్‌రెడ్డి.. డెప్యుటేషన్‌పై రెండేళ్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సేవలందించడానికి కేంద్ర ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కమిషనర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ స్థానంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా, ప్రభుత్వ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శిగా విజయకుమార్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విజయకుమార్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. 

మరిన్ని వార్తలు