నకిలీ వైద్యులపై చర్యలేవీ?

23 Mar, 2018 02:53 IST|Sakshi

మండలిలో అధికారపక్ష సభ్యుల విమర్శల పర్వం

ఇరకాటంలోపడ్డ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పనితీరును తప్పుపడుతూ గురువారం శాసనమండలిలో అధికారపక్ష సభ్యులే మంత్రి లక్ష్మారెడ్డిపై విమర్శలు చేశారు. నకిలీ వైద్యులకు సంబంధించిన ప్రశ్న సందర్భంగా ఎంఎస్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ ఆర్‌ఎంపీ డాక్టర్లు అమాయక ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. అలాంటి వారిపై పీడీ చట్టం కింద కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

ఇటీవల ఓ ఆస్పత్రిలో చేరిన మహిళకు పరీక్షలేవీ చేయకుండానే 15 రోజుల వ్యవధిలో మూడు సర్జరీలు చేసి ఆమె మృతికి కారణమైన వైద్యులు, ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీకి, మంత్రి పేషీకి ఫిర్యాదు చేసినా ఇంత వరకు స్పందించలేదని మరో సభ్యుడు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి విమర్శించారు. అలాగే సరైన వైద్యం అందించక పోవడంతో అదే ఆస్పత్రిలో ఓ మాజీ ఎమ్మెల్యే మృతి చెందిన ఘటనపైనా ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు.

దీనిపై లక్ష్మారెడ్డి స్పందిస్తూ మహిళ మృతి కేసులో చట్ట ప్రకారం ఆస్పత్రిపె చర్యలు తీసుకుంటామని, మాజీ ఎమ్మెల్యే మృతి అంశంపై విచారణ జరుగుతోందన్నారు. ఇంకా పలువురు సభ్యులు విమర్శలు కురిపించడంతో మంత్రి లక్ష్మారెడ్డి కొంత అసహనానికి గురవగా ఆర్థిక మంత్రి ఈటల కల్పించుకొని మాట్లాడుతూ రాత్రికి రాత్రే అన్ని సమస్యలు పరిష్కారం కావన్నారు. ఏవైనా సమస్యలుంటే మంత్రుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలంటూ అందరినీ సమాధాన పరిచారు.

1.83 లక్షల కేసీఆర్‌ కిట్ల పంపిణీ
రాష్ట్రంలో స్వల్పకాలంలోనే 1.83 లక్షల కేసీఆర్‌ కిట్లను పంపిణీ చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి వెల్లడించారు. గురువారం శాసనమండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ కిట్ల పథకం ప్రారంభమయ్యాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో 55 శాతం ప్రసవాలు పెరిగాయని, మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు.  

మరిన్ని వార్తలు