నలుగురు పార్టీ మారినా నష్టం లేదు: చంద్రబాబు

20 Jun, 2019 21:44 IST|Sakshi

అమరావతి: నలుగురు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన టీడీపీకి  ఏమాత్రం నష్టం లేదని ఏపీ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండటంతో ఆయన తరపున టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ దారపనేని నరేంద్ర ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రత్యేక హోదా కోసం బీజేపీతో టీడీపీ పోరాడిందని, అది మనసులో పెట్టుకుని ఈ విధమైన దుశ్చర్యలకు బీజేపీ పాల్పడటం గర్హనీయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగు దేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదని, 37 ఏళ్ల చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని, కార్యకర్తలు ముందుండి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నడిపి పార్టీకి అండగా నిలబడి కాపాడుకున్నారని చంద్రబాబు తెలిపారు.

టీడీపీ ఎంపీలు పార్టీ మారడంపై పలువురు టీడీపీ నేతలు స్పందించారు. అమరావతిలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ.. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వారు బీజేపీలో చేరారని, నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతున్నట్లు చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. సుజానా, సీఎం రమేష్‌, గరికపాటి వార్డు మెంబర్‌గా గెలవలేదని, అలాంటి వారికి రాజ్యసభ ఎంపీలుగా అవకాశం ఇచ్చి గౌరవించారని పేర్కొన్నారు. స్వప్రయోజనాల కోసం పార్టీని వీడిన దద్దమ్మలని దుయ్యబట్టారు.  మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ మాట్లాడుతూ..ఈడీ, సీబీఐ కేసులకు భయపడి టీడీపీ ఎంపీలు, బీజేపీలో చేరారని ఆరోపించారు. 
 

మరిన్ని వార్తలు