బీజేపీ గెలిచింది కానీ..!

25 Oct, 2019 03:01 IST|Sakshi
ఎన్నికల్లో విజయం తర్వాత తమ పార్టీకి మద్దతిచ్చిన వారితో మాట్లాడేందుకు వస్తున్న మోదీపై కురుస్తున్న పూలవర్షం

హరియాణా, మహారాష్ట్రల్లో ఆశించిన మెజారిటీకి ఆమడ దూరంలో..

మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికి సింపుల్‌ మెజారిటీ

అనూహ్యంగా పుంజుకున్న ఎన్సీపీ, కాంగ్రెస్‌

ముంబై/చండీగఢ్‌: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి అధికారాన్ని నిలుపుకున్నప్పటికీ.. ఆశించిన మెజారిటీ రాలేదు. మరోవైపు, గెలుపు సునాయాసమనుకున్న హరియాణాలో బీజేపీ ఊహించని రీతిలో చతికిలపడింది. చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. హంగ్‌ ఏర్పడటంతో హరియాణాలో 10 స్థానాలు గెలుచుకున్న జననాయక జనతా పార్టీ(జేజేపీ) కింగ్‌ మేకర్‌గా మారింది.  

అక్టోబర్‌ 21న జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి విజయం, హరియాణాలో బీజేపీ గెలుపు అంతా ఖాయమనుకున్నారు. ఈ సంవత్సరం మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ పూర్తిస్థాయిలో ఆధిక్యత చూపడంతో ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమేనని భావించారు. ప్రచారంలోనూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇవ్వలేదని భావించారు. కానీ అనూహ్యంగా మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి, హరియాణాలో కాంగ్రెస్‌ పుంజుకున్నాయి. 288 స్థానాల మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ శివసేన కూటమికి 200కి పైగా సీట్లు వస్తాయని భావించారు.

కానీ కాషాయ కూటమి 161 స్థానాల్లో(బీజేపీ 105, శివసేన 56) మాత్రమే విజయం సాధించింది. అయితే, మెజారిటీ రావడంతో రెండో సారి అధికారం చేపట్టనుంది. అనూహ్యంగా పుంజుకున్న ఎన్సీపీ 54 సీట్లలో, కాంగ్రెస్‌ 45 సీట్లలో విజయం సాధించాయి.  హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 40 సీట్లలో గెలుపొంది, మెజారిటీకి 6 స్థానాల దూరంలో నిలిచింది. కాంగ్రెస్‌ 31 సీట్లు గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో 15 స్థానాలే గెలుచుకున్న కాంగ్రెస్‌కు ఇది డబుల్‌ ధమాకానే. 10 స్థానాల్లో విజయం సాధించిన జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ) కింగ్‌ మేకర్‌గా నిలిచింది. ఐఎన్‌ఎల్‌డీ ఒక స్థానంలో ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించారు.

జేజేపీని గత సంవత్సరమే దుష్యంత్‌ చౌతాలా స్థాపించారు. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి మద్దతివ్వాలా లేక కాంగ్రెస్‌కా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని దుష్యంత్‌చౌతాలా చెప్పారు. కాగా, హరియాణాలో బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా గురువారం స్పష్టం చేశారు. మరోవైపు, హరియాణాలో బీజేపీయేతర పార్టీలన్నీ  ప్రభుత్వ ఏర్పాటుకు కలసిరావాలని కాంగ్రెస్‌ నేత భూపీందర్‌ సింగ్‌ హూడా పిలుపునిచ్చారు. కాగా, మహారాష్ట్ర, హరియాణా ఫలితాలను బీజేపీ స్వాగతించింది.  మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌పై ఆయా రాష్ట్రాల ప్రజలు మరోసారి విశ్వాసం చూపారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని పార్టీ ప్రతినిధి వ్యాఖ్యానించారు.

బీజేపీపై మళ్లీ విశ్వాసం చూపించారు: మోదీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఆ పార్టీ ముఖ్యమంత్రులపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడానికి వచ్చే ఐదేళ్లలో వారు మరింత కష్టపడతారని చెప్పారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ల నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, 2014లో పాలనా పగ్గాలు చేపట్టేనాటికి ఎటువంటి అనుభవం లేనప్పటికీ గడచిన ఐదేళ్లలో వారు స్వచ్ఛమైన పరిపాలనను ప్రజలకు అందించి, ప్రజల విశ్వాస్వాన్ని గెలుపొందారని పేర్కొన్నారు. 2014కు ముందు రెండు రాష్ట్రాల్లో జూనియర్‌ భాగస్వామిగా ఉన్న బీజేపీ అటు తర్వాత కీలకస్థానానికి చేరిన విషయాన్ని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.  

ఫలితాలపై సమీక్ష
గురువారమిక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్‌ అత్యున్నత స్థాయి సమావేశానికి ప్రధాని నేతృత్వం వహించారు. ఈ సమావేశంలో తాజా అసెంబ్లీ ఫలితాలను సమీక్షించారు. మహారాష్ట్రతో పాటు, మెజారిటీకి ఆరు సీట్ల దూరంలో నిలిచిన హరియాణాలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేయాలని బోర్డు నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా