గిరిజనులను మోసగిస్తున్న ప్రభుత్వం

8 Jun, 2018 22:30 IST|Sakshi
పాడేరులో అభిమానులు ఇచ్చిన విల్లు   ఎక్కుపెడుతున్న పవన్‌ కల్యాణ్‌

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శ

పాడేరు : షెడ్యూల్‌ ప్రాంతాల్లోని గిరిజనులను ప్రభుత్వం మోసగిస్తోందని, గిరిజన ప్రాంతాలు దోపిడీకి గురవుతూ  కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. పాడేరులోని అంబేడ్కర్‌ సెంటర్‌లో గురువారం జనసేన ప్రజా పోరాట యాత్ర బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ  ఇచ్ఛాపురం నుంచి ఇక్కడి వరకూ బాధకలిగించే సంఘటనలు చాలా చూశానని  గిరిజన గ్రామాల్లో కనీస పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం లేకపోవడం దారుణమని అన్నారు. మన్యంలో వామపక్షాలతో కలిసి గిరిజన సమస్యలపై పోరాటం చేస్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.  పవన్‌ హుకుంపేట మండలంలో కూడా పర్యటించారు.

ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పట్టదా?

మాడుగుల : ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం  సీఎం చంద్రబాబుకు పట్టలేదని  జనసేన అదినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. జనసేన పోరాట యాత్రలో బాగంగా గురువారం మధ్యాహ్నం మాడుగుల వచ్చిన ఆయన ఇక్కడి కూడలిలో మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించటంలో సీఎం విఫలమయ్యారని పేర్కొన్నారు. మాడుగుల నియోజకవర్గంలో జల వనరులు పుష్కలంగా ఉన్నా సరే అసంపూర్తిగా జలాశయాలు ఉన్ననందున ఇక్కడ రైతులు వలసలు పోతున్నారన్నారు.

జనసేనకు కులాలు లేవు

నర్సీపట్నం : తాను తన సామాజిక వర్గం గురించి ఆలోచిస్తే గత ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతు పలుకుతానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ గురువారం సాయంత్రం పట్టణంలోని అబీద్‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు తనపై చేసిన విమర్శలకు పవన్‌ స్పందిస్తూ జనసేనకు కులాలు లేవని, తనకు అన్నికులాలు సమానమేనని పవన్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు