ధ్యానం కోసం విదేశాలకు పోయిండు!!

30 Oct, 2019 18:32 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మళ్లీ విదేశాలకు వెళ్లారు. ఈసారి ఆయన ధ్యానం చేసేందుకు విదేశీ పర్యటనకు వెళ్లినట్టు కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. ఆయన ఎక్కడికి వెళ్లింది వెల్లడించలేదు. దేశంలో ఆర్థికమాంద్యం నేపథ్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా వారంపాటు కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్య నాయకుడు ఇలా విదేశాలకు వెళ్లిపోవడం హస్తం శ్రేణులను చిక్కుల్లో పడేసింది. నిజానికి కేంద్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలకు రాహుల్‌ గాంధే ప్లాన్‌ చేశారు. నవంబర్‌ ఒకటి నుంచి 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలు నిర్వహించనున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది.

అయితే, రాహుల్‌ తలపెట్టిన ఆందోళనల సమయంలో ఆయనే అందుబాటులో లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. రాహుల్‌ ధ్యానం కోసం విదేశాలకు వెళ్లారన్న వార్తలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ధ్యానానికి ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ఎంతో ప్రసిద్ది అని, అలాంటిది భారత్‌ను వదిలి ఆయన ధ్యానం కోసం వేరే దేశం ఎక్కడికో వెళ్లడం ఏమిటని బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ ప్రశ్నించారు. విదేశీ ప్రయాణాల పేరిట రాహుల్‌ ఎక్కడికి వెళుతున్నారో వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ మాత్రం రాహుల్‌ విదేశీ టూర్‌ను సమర్థించేందుకు తంటాలు పడుతోంది. రాహుల్‌ మార్గనిర్దేశకత్వంలో ఆయన సూచనల మేరకే దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తున్నామని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు