భారత్‌ బంద్‌కు రాజ్‌ థాకరే మద్దతు

9 Sep, 2018 14:00 IST|Sakshi
ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ థాకరే (ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై : ఇంధన భారాలకు వ్యతిరేకంగా సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపునకు రాజ్‌ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) మద్దతు ప్రకటించింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని అంటుతుండటం పట్ల సామాన్య ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, భారత్‌ బంద్‌లో తమ పార్టీ చురుకుగా పాల్గొంటుందని రాజ్‌ థాకరే ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

పెట్రో ధరలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులతో మరింత భారమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి ఇష్టాఇష్టాలకు అనుగుణంగా దేశ విధానాలు ఉండటం ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి పరోక్షంగా  వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని దుయ్యబట్టారు.

నోట్ల రద్దు పర్యవసానాలను చక్కదిద్దుకునేందుకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై భారీగా పన్నులు వడ్డించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలకు సామాన్యుడిపై భారం ఎందుకు మోపుతున్నారని ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రజలంతా రాజకీయ, సిద్ధాంత వైరుధ్యాలను పక్కనపెట్టి బంద్‌లో పాల్గొనాలని కోరారు.

మరిన్ని వార్తలు