అక్బర్‌ మహిళల్ని వేధించేవాడు

7 Jun, 2019 02:40 IST|Sakshi

రాజస్తాన్‌ బీజేపీ చీఫ్‌ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు

జైపూర్‌: రాజస్తాన్‌ బీజేపీ చీఫ్‌ మదన్‌లాల్‌ సైనీ సరికొత్త వివాదానికి తెరలేపారు. మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ మారువేషంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆయన ఆరోపించారు. మేవార్‌ రాజు మహారాణా ప్రతాప్‌ జయంతి సందర్భంగా గురువారం జైపూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘అక్బర్‌ మహిళలు మాత్రమే పనిచేసే మీనా బజార్లను ఏర్పాటు చేశాడని ప్రపంచమంతటికీ తెలుసు. అందులోకి పురుషులకు ప్రవేశం నిషిద్ధం. కానీ అక్బర్‌ మాత్రం మారువేషంలో మీనాబజార్లలోకి ప్రవేశించి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు.

ఈ క్రమంలోనే బికనీర్‌ రాణి కిరణ్‌దేవిని కూడా వేధించడంతో ఆమె అక్బర్‌ గుండెలపైకి కత్తి దూసింది. వెంటనే అక్బర్‌ తన ప్రాణాల కోసం వేడుకున్నాడు. అక్బర్‌ కంటే మహారాణా ప్రతాప్‌ చాలా గొప్పవాడు. ఎందుకంటే ఆయన తన మతం, సంస్కృతి, గౌరవం కోసం పోరాడాడు. ఇతరుల భూములను లాక్కోలేదు’ అని వ్యాఖ్యానించారు. కాగా, సైనీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత అర్చనా శర్మ తీవ్రంగా మండిపడ్డారు. సైనీ చేసిన వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాణా ప్రతాప్‌ ధైర్యసాహసాలను దేశమంతా గౌరవిస్తోందనీ, కానీ చరిత్రకు ఇలాంటి తప్పుడు వక్రీకరణల కారణంగా సమాజంలో విద్వేషాలు వేళ్లూనుకుంటాయనీ, అంతిమంగా దేశసమగ్రతకు నష్టం జరుగుతుందని ఆమె హెచ్చరించారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు