వివాదస్పదంగా మారిన రిటర్నింగ్‌ అధికారి నిర్ణయం

26 Mar, 2019 20:22 IST|Sakshi

మంత్రి దేవినేని ఒత్తిడితో షరీఫ్‌ బీఫారం రద్దు!

సాక్షి, కృష్ణా : నామినేషన్ల పరిశీలన సందర్భంగా కృష్ణాజిల్లా మైలవరంలో హైడ్రామా నెలకొంది. నిబంధనల ప్రకారం ఒకరి నామినేషన్‌ను రద్దు చేయాల్సింది ఉండగా మరొకరి నామినేషన్‌ రద్దు చేశారు రిటర్నింగ్‌ అధికారి. వివరాల్లోకి వెళితే.. ప్రజాశాంతి పార్టీ తరపున మైలవరంలో షేక్‌ షరీఫ్‌, బోగోలు వెంకట కృష్ణారావు నామినేషన్లు దాఖలు చేశారు. తరువాత బోగోలు వెంకట కృష్ణారావు బీఫారం రద్దుచేస్తూ షరీఫ్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అధికారిక లేఖను ఇచ్చారు. ఈ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి షరీప్‌ సమర్పించారు. నిబంధనల ప్రకారం వెంకటకృష్ణారావు భీఫారంను రద్దుచేయాల్సిన రిటర్నింగ్ అధికారి.. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒత్తిళ్లతో షరిఫ్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు. వెంకట కృష్ణారావు బీ ఫారంని కొనసాగించాలంటూ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒత్తిడితో షరీఫ్‌ను భీఫారంను రద్దు చేసినట్లు సమాచారం.

మొదట ఎలాంటి నిర్ణయం తీసుకొని సదరు అధికారి.. బయటకు వెళ్లిపోయి కాసేపటికి తిరిగి వచ్చి వెంకట కృష్ణారావును ప్రజాశాంతి అభ్యర్థిగా గుర్తించినట్లు ప్రకటించారు. దీంతో షరీఫ్‌ వర్గీయులు ఆందోళనకు దిగారు. రిటర్నింగ్‌ అధికారి వైఖరిని నిరసిస్తూ ఎండీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. మంత్రి దేవినేని ఆదేశాలతోనే రిటర్నింగ్ అధికారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటర్నింగ్‌ అధికారి నిర్ణయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు.

కాగా ఓట్లను చీల్చేందుకై వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లున్న వ్యక్తులను ప్రజాశాంతి పార్టీ తమ అభ్యర్థులుగా పోటీలోకి దించిన విషయం తెలిసిందే. నామినేషన్ల పర్వం చివరి రోజున ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ఇలాంటి తిరకాసుకు పాల్పడ్డారు. మైలవరంలో కూడా వెస్సార్‌సీపీ అభ్యర్థి వెంకటకృష్ణ ప్రసాద్‌ పేరును పోలీఉన్న వ్యక్తి వెంకట కృష్ణారావుతో నామినేషన్‌ వేయించారు. ఈ తతంగం చూస్తే తెలుగుదేశం పార్టీ, ప్రజాశాంతి పార్టీల మధ్య అంతర్గత బంధం ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్‌ గుర్తును తీసుకుంది. హెలికాప్టర్‌ రెక్కలు వైఎస్సార్‌సీపీ ఫ్యాన్‌ గుర్తును పోలి ఉన్నాయి. ఇక ఆ పార్టీ జెండా రంగుల విషయానికొస్తే వైఎస్సార్‌సీపీ జెండా రంగులను పోలి ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు