కేసీఆర్‌ కుటుంబ కూటమిగా టీఆర్‌ఎస్‌

21 Nov, 2018 00:40 IST|Sakshi

కేసీఆర్‌ను గద్దె దించేందుకే ప్రజాకూటమి

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి

మేడ్చల్‌: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించేందుకే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ,టీజేఎస్‌లు ప్రజాకూటమిగా ఏర్పడ్డాయని, టీఆర్‌ఎస్‌ మాత్రం కేసీఆర్‌ కుటుంబ కూటమి తయారైందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హాజరుకానున్న మేడ్చల్‌ సభ ఏర్పాట్లను మంగళవారం రేవంత్‌రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భం గా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ నెల 23న సోనియాగాంధీ రాష్ట్రానికి వస్తున్నారని, ఆమెకు కృతజ్ఞతలు చెప్పేందుకు మేడ్చల్‌ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని రేవంత్‌ కోరారు. ఎన్నికల సమయంలోనే కేసీఆర్‌ ప్రజలమధ్య ఉంటారని లేకపోతే కాంట్రాక్టర్లు ఇచ్చే నోట్ల కట్టలను లెక్కించుకుంటూ ప్రగతిభవన్‌లోనే ఉంటారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలనను అంతమొందించడానికి తాము ప్రజా కూటమిగా ఏర్పడితే ఎంఐఎం, బీజేపీలు టీఆర్‌ఎస్‌ కోసం కూటమిగా మారాయని ఆరోపించారు.

నిరూపించకపోతే ముక్కు నేలకు రాస్తారా?
సీబీఐ అవినీతి వ్యవహారంలో మేడ్చల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కె.లక్ష్మారెడ్డి (కేఎల్‌ఆర్‌) తప్పుచేసినట్లయితే ఆయన తరఫున అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తానని, ఒకవేళ ఆరోపణలు నిరూపించలేకపోతే కేసీఆర్‌ ముక్కు నేలకు రాస్తారా అని రేవంత్‌సవాల్‌ విసిరారు.

సోనియా సభ బాధ్యతను కేఎల్‌ఆర్‌ తీసుకోవడంతో ఆయనపై బురదచల్లే విధంగా టీఆర్‌ఎస్‌కు చెందిన దినపత్రికలో వార్తలు రాయిం చుకున్నారని ఆరోపించారు. డిసెంబర్‌ 7 నాటికి టీఆర్‌ఎస్‌లోని ముగ్గురు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరతారని మరోసారి స్పష్టం చేశారు. ఆయన వెంట ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్‌మానే, రాష్ట్ర నాయకులు వేణుగోపాల్, రుద్రరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి కేఎల్‌ఆర్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు