సిట్టింగ్‌ ప్రొఫైల్‌

13 Nov, 2018 01:31 IST|Sakshi

పాత మెదక్‌ జిల్లాలోని ఈ నియోజక వర్గం.. సిద్దిపేట పేరుతోనే కొత్త జిల్లాగా ఆవిర్భవించింది. 4 మండలాలు, 81 గ్రామ పంచాయతీలు, 35 మధిర గ్రామాలతో ఈ నియోజకవర్గం ఉంది. మొత్తంగా రూ.1,800 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగినట్టు టీఆర్‌ఎస్‌ చెబుతోంది. మెడికల్‌ కళాశాల ఏర్పాటు ఓ మైలురాయి. గురుకులాలు, 5 పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉన్నాయి.  500 పడకల ఆస్పత్రి నిర్మాణంలో ఉంది. కొత్త జిల్లాలోని అన్ని శాఖలకు సమీకృత భవనాల నిర్మాణం కొనసాగుతోంది. అధునాతన మోడల్‌ రైతుబజార్,  ప్రతి మండల కేంద్రంలో వ్యవసాయ గోడౌన్లు, వైకుంఠ ధామాలు ఏర్పాటయ్యాయి. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిన నియోజకవర్గంగా గుర్తింపు.. ఆహ్లాదపు ‘స్పాట్‌’గా కోమటిచెరువు.. స్విమ్మింగ్‌పూల్, ఎల్‌ఈడీ, సోలార్‌ విద్యుత్‌ కేంద్రాల వంటివి అదనపు హంగులు. మలేషియా సహకారంతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు కానుంది.

తన్నీరు హరీశ్‌రావు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ఆవిర్భావం నుంచీ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రచార కార్యదర్శిగానూ పనిచేశారు. 2004లో తొలిసారిగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. అనంతరం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో యువజన సర్వీసులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ, అటు తరువాత 2009 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2010లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసి.. ఉప ఎన్నికల్లో తిరిగి గెలుపొందారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో 95 వేల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం రద్దయిన ప్రభుత్వంలో ఆయన భారీ నీటిపారుదల, శాసనసభ వ్యవహారాలు, మార్కెటింగ్‌ శాఖల మంత్రిగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఆరోసారి పోటీకి దిగుతున్నారు.

అమలవుతున్న పథకాలు
ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్‌ కిట్, పశువుల పాకల నిర్మాణం, సబ్సిడీ గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు పనిముట్లు– వాహనాల పంపిణీ, సీఎంఆర్‌ఎఫ్, స్ప్రింక్లర్లు, మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలు.

ప్రధాన సమస్యలు
కరువు ప్రాంతం. సాగు, తాగునీటికి ఇబ్బందులు.. మిషన్‌ భగీరథ పథకం దాదాపు పూర్తి కావచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని రంగనాయకసాగర్‌ పాజెక్టు పూర్తయితే సాగునీటి కష్టాలు తీరతాయి. యువతకు ఉపాధి మార్గాలు పెంచాల్సి ఉంది.
..::ఇన్‌పుట్స్‌: ఈరగాని భిక్షం

మరిన్ని వార్తలు