కలలన్నీ కల్లలే!

24 Nov, 2018 02:58 IST|Sakshi
సభా వేదికపై సోనియాగాంధీతో ఎల్‌.రమణ, చాడ వెంకట్‌రెడ్డి, కోదండరాం, చెరుకు సుధాకర్, కుంతియా

అన్నీ ఆలోచించి ఓటేయండి

మేడ్చల్‌ సభలో సోనియాగాంధీ పిలుపు 

టీఆర్‌ఎస్‌ కుటుంబం కోసమే పనిచేసి, పాలన పట్టించుకోలేదు 

దళితులు, ఆదివాసీలు, మహిళలందరినీ విస్మరించారు 

కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం... ఆలోచించి ఓటేయండి 

ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ 

ప్రజా ఆకాంక్షల్ని పట్టించుకోని ప్రభుత్వాన్ని సాగనంపండి: రాహుల్‌ 

రాష్ట్ర సాధన సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్తులు నా ముందున్నాయి. కానీ, తెలంగాణ ప్రజల ఉద్యమస్ఫూర్తిని చూసి ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న నిర్ణయానికి వచ్చాం. దీంతో కాంగ్రెస్‌కు ఏపీలో ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసు. అయినా, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చాం.    – సోనియా గాంధీ

సాక్షి, హైదరాబాద్‌ :‘‘నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదు. కేవలం కుటుంబం కోసం పనిచేస్తూ, తెలంగాణలో పరిపాలనను విస్మరించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కాంగ్రెస్‌ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలి’’అని యుపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ పిలుపునిచ్చారు. శుక్రవారం మేడ్చల్‌లో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొంతకాలం తర్వాత తన సంతానాన్ని చూస్తే ఒక తల్లి ఎంతగా సంబరపడుతుందో, తాను కూడా తెలంగాణ ప్రజలను కలుసుకుంటున్నందుకు అంతే ఆనందపడుతున్నానని పేర్కొన్నారు. ప్రతి తల్లి తన సంతానం సుఖసంతోషాలతో దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటుందని, అయితే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా జరగడంతో ఓ తల్లిగా తానెంతో దుఃఖించినట్టు చెప్పారు. ఈ ప్రస్తావన సందర్భంగా ఆమె గొంతు కొద్దిగా జీరపోయి, పూడుకుపోయిన స్వరంతో మాట్లాడారు.

‘‘తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయో నాకు ఇంకా గుర్తుంది. ఆ సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్తులు నా ముందున్నాయి. కానీ, తెలంగాణ ప్రజల ఉద్యమస్ఫూర్తి, పోరాట పటిమను చూసి అప్పటి ప్రధాని మన్మోహన్, రాహుల్‌గాంధీ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా ఎంత నష్టం వాటిల్లుతుందో మాకు తెలుసు. అయినా, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చేందుకే మొగ్గుచూపాం’’అని వివరించారు. అదే సమయంలో ఆంధ్రపదేశ్‌ ప్రజల ప్రయోజనాలను విస్మరించలేదన్నారు. వాటిని పరిరక్షించేందుకు ప్రత్యేక హోదాను ప్రతిపాదించామని, పార్లమెంటులో ప్రకటన కూడా చేశామని గుర్తుచేశారు. ఏపీ ప్రజలకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని సభ సాక్షిగా వాగ్దానం చేస్తున్నామని పేర్కొన్నారు. ఏపీలో ప్రతీ బిడ్డా అన్ని విధాలుగా దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. 

తెలంగాణ బిడ్డలకు ఏం దక్కింది? 
ఏ కలల కోసమైతే, ఏ ఆకాంక్షల సాధన కోసమైతే తెలంగాణ బిడ్డలు పోరాడారో అవేమీ దక్కలేదని సోనియాగాంధీ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ నాలుగున్నరేళ్ల పాలనలో అనుకున్నంత అభివృద్ధి జరగలేదని.. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. సాగునీటి కోసం రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. తమ హయాంలో రూపొందిన భూసేకరణ చట్టాన్ని నీరుగార్చిన టీఆర్‌ఎస్‌ సర్కారు రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సైతం ఈ ప్రభుత్వం నీరుగార్చిందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలంతా తీవ్ర నిరాశలో ఉన్నారని.. ముఖ్యంగా యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోందని పేర్కొన్నారు. ‘‘ఇక్కడి స్వయం సహాయక మహిళా బృందాలను చూసి గర్వపడేదాన్ని. ఇతర రాష్ట్రాలకు వెళ్లినపుడు వీరి గురించి గొప్పగా చెప్పేదాన్ని. కానీ, ఇప్పుడు వీరి పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. రాష్ట్రంలో ప్రజల ఈ దుస్థితికి ముమ్మాటికీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనా వైఫల్యమే కారణం’’అని మండిపడ్డారు. దళిత, ఆదివాసీల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. యువత, నిరుద్యోగులు, మహిళలు, సంక్షేమాన్ని విస్మరించి కేవలం తన కుటుంబం కోసమే పనిచేశారని ఆరోపించారు. గెలిపించిన ప్రజల పట్ల టీఆర్‌ఎస్‌ పార్టీకి ఏమాత్రం విశ్వసనీయత లేదని విమర్శించారు.

పిల్లల పెంపకంలో లోపం ఉంటే చిన్నారుల భవిష్యత్తు పాడవుతుందని.. ఇపుడు టీఆర్‌ఎస్‌ నాలుగన్నరేళ్ల పాలన కారణంగా తెలంగాణ పౌరుల జీవితాలు అగమ్య గోచరంగా మారాయని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రతిష్టాత్మమైనవి, నిర్ణయాత్మకమైనవని.. కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, నిరుద్యోగులకు న్యాయం చేసేలా అన్ని వర్గాల సంక్షేమానికి స్పష్టమైన హామీలు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమస్ఫూర్తితో ఇపుడు కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. లోతుగా ఆలోచించి, విశ్లేషించి కూటమికి ఓటేయాలని సూచిస్తూ.. జైహింద్, జై తెలంగాణ అన్న నినాదాలతో సోనియా తన ప్రసంగాన్ని ముగించారు. 

టీఆర్‌ఎస్‌ పాలన ముగియబోతోంది: రాహుల్‌
ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో సోనియాగాంధీ తెలంగాణ ప్రజల వెంట నిలిచారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. తెలంగాణను ప్రజలు ఉద్యమం, చెమట, రక్తమోడి సాధించుకున్న రాష్ట్రంగా అభివర్ణించారు. ఉద్యమ సమయంలో సోనియాగాంధీ చూపించిన సహకారం మరువలేనిదన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలన ముగియబోతోందని.. ఈ లక్ష్యం కోసమే కాంగ్రెస్‌తో టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఒక్కటయ్యాయని రాహుల్‌ వివరించారు. తెలంగాణ ప్రజల కలల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చలేని ప్రభుత్వాన్ని అంతమొందించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఏనాడూ ప్రజల కోసం పనిచేయలేదని, కేవలం కుటుంబం కోసమే పరిపాలన సాగించారని ఆరోపించారు. కానీ, రాబోయే ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని.. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. రైతుల కష్టాలు తీరుస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రజల ఆకాంక్షలను చేరుకునేలా పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

టీఆర్‌ఎస్‌ను బొందపెట్టాలి: ఉత్తమ్‌ 
నాలుగన్నరేళ్లపాటు పాలించిన టీఆర్‌ఎస్‌ పార్టీని బొందపెట్టాలని, గోరీ కట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. వచ్చేది ముమ్మాటికీ ప్రజాకూటమి ప్రభుత్వమేనని «ధీమా వ్యక్తంచేశారు. అందుకే ప్రజలంతా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ, లక్షలాది ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తామని స్పష్టంచేశారు. రూ.1,000 పింఛన్‌ను రూ.2,000కు, రూ.1,500 పింఛన్‌ను రూ.3,000కు పెంచుతామని హామీ ఇచ్చా రు. కూటమిపై కేసీఆర్‌ చేస్తున్న పిచ్చి ఆరోపణల్ని నమ్మొద్దని ప్రజల్ని కోరారు. కేసీఆర్‌ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ ప్రాజెక్టుల కోసం ప్రధానిని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. 
దాసోజు అనువాదం..: చాలాకాలం తర్వాత సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఒకే వేదికపై ప్రసంగించారు. వీరిద్దరికీ టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి, ఖైరతాబాద్‌ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌ అనువాదకులుగా వ్యవహరించారు. సోనియా, రాహుల్‌ ప్రసంగాలను తనదైన శైలిలో చక్కగా వ్యక్తీకరించారు. బహుభాషా పండితుడైన శ్రవణ్‌.. తన సహజ వాక్పటిమతో అనువాదం చేశారు. 

దామోదర గైర్హాజర్‌... 
సోనియా, రాహుల్‌ ప్రారంభించిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. తనకు తగిన ప్రాధాన్యత లభించలేదన్న అసంతృప్తితో ఆయన రాలేదా లేక మరేదైనా కారణముందా అని పలువురు నేతలు చర్చించుకున్నారు. అందోల్‌ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందునే ఆయన రాలేకపోయారని కొందరు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.  

పార్టీలో చేరిన కొండా, యాదవరెడ్డి
సోనియా, రాహుల్‌ సమక్షంలో మేడ్చల్‌ సభా వేదికపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
రాహుల్, సోనియా సమక్షంలో పార్టీలో చేరిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

సభ హైలెట్స్‌ 

  • కార్తీక పౌర్ణమి, గురునానక్‌ జయంతి శుభాకాంక్షలతో సోనియాగాంధీ తన ప్రసంగం ప్రారంభించారు. 
  • పొదుపు సంఘాల గురించి ఆమె చేసిన ప్రస్తావన ఆకట్టుకుంది. 
  • సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సోనియా భారీ కటౌట్‌ వద్ద అభిమానులు సెల్ఫీలు దిగారు. 
  • సోనియా, రాహుల్, రేవంత్‌ ప్రసంగాల సమయంలో కార్యకర్తలు కేరింతలు చేస్తూ బాణసంచా కాల్చారు. 
  • సోనియా, రాహుల్‌ వేర్వేరుగా వేదిక పైకి వచ్చిన సమయంలో సభికులు కుర్చీలపై నుంచి లేచి అభివాదం చేశారు. 
  • తెలంగాణ ఇంటి పార్టీ కార్యకర్తలు తమ పార్టీ జెండాలు పట్టుకుని తిరుగుతూ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 
  • టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అభిమానులు ప్లకార్డులు చేతపట్టుకుని అందరినీ ఆకర్షించారు. 
  • జనగామ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్యకు చెందిన ఒగ్గు కళాకారులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. 
  • భట్టి విక్రమార్క అభిమానులు ప్రత్యేకంగా డప్పు వాయిద్యాలతో అందరినీ అలరించారు. 
  • ఏపూరి సోమన్న కళాబృందం తమ ఆటపాటలతో ఆకర్షణగా నిలిచింది. 
  • ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు సభా ప్రాంగణంలో భారీ జెండాలను ప్రదర్శించారు. 
  • సోనియాగాంధీ సభ సందర్భంగా మేడ్చల్‌ పట్టణం ప్రజాకూటమి జెండాలతో కళకళలాడింది. 
  • కేసీఆర్‌ డోకాబాజి పేరుతో నాలుగు చక్రాల బండిపై కేసీఆర్‌ కుటుంబం చిత్రాలను ఏర్పాటు చేసి, వారి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకం విఫలమైందని పేర్కొనడం ఆకర్షణగా నిలిచింది. 
  • వీఐపీ, మీడియా ద్వారాల వద్ద పోలీసులు అడ్డు చెబుతున్నా కాంగ్రెస్‌ అభ్యర్థుల అనుచరులు లోపలకు చొచ్చుకెళ్లారు. 
  • సభలో గద్దర్‌ పాడిన పాట అందరిలో జోష్‌ నింపింది. 
  • సభా ప్రాంగణం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కిష్టాపూర్‌ దారిలో వాహనాలు పార్కింగ్‌ చేసి ఉండడంతో అక్కడి నుంచి కార్యకర్తలు నడుచుకుంటూ వచ్చారు.   
మరిన్ని వార్తలు