రేపు టీఆర్‌ఎస్‌లోకి ఉప్పల శ్రీనివాస్‌గుప్తా

9 Oct, 2018 01:11 IST|Sakshi

హైదరాబాద్‌: అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఉప్పల ఫౌండేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా ఈ నెల 10న మంత్రి కేటీఆర్‌ సమక్షంలో వేలాది మంది కార్యకర్తలతోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం కేసీఆర్‌ ఎనలేని సేవ చేస్తున్నారని, ఆ గొప్ప నాయకుడి దారిలో నడిచి ప్రజాభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని తెలిపారు.

గుజరాత్‌ మాదిరిగా తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణలో ఆర్య వైశ్యుల అభివృద్ధి కోసం 2 కార్పొరేషన్‌ పదవులతో పాటు నామినేటెడ్‌ పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. వైశ్య భవనం కోసం ఉప్పల్‌ బాగాయత్‌లో 500 గజాల స్థలం, రూ.10 కోట్లు నిధులు కేటాయించారని తెలిపారు. వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని తనకే ఇస్తారనే నమ్మకం ఉందన్నారు. 10న ఉదయం 9 గంటలకు నాగోలులోని తన నివాసం నుంచి కార్లు, బైకులతో ర్యాలీగా వెళ్లి పార్టీలో చేరతానని చెప్పారు.


టీఆర్‌ఎస్‌కు జగిత్యాల ముస్లిం నేతల మద్దతు
సాక్షి, హైదరాబాద్‌: అన్ని వర్గాలతోపాటు ముస్లింల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్‌ఎస్‌కు తమ మద్దతు ఉంటుందని జగిత్యాల ముస్లిం నాయకులు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లో పలువురు ముస్లిం నాయకులు నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవితను కలసి తమ సమస్యలను వివరించారు.

‘కేసీఆర్‌ ముస్లింల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. జగిత్యాలలో ముస్లింలు నివసిస్తున్న ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాం. ప్రభుత్వ పథకాల్లో ముస్లింలను భాగస్వామ్యం చేశాం’అని పేర్కొన్నారు. ఎంపీని కలసిన వారిలో జగిత్యాల మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు ఖాజా లియాఖత్‌ అలీ, టీఆర్‌ఎస్‌ జగిత్యాల పట్టణ ముస్లిం విభాగం అధ్యక్షుడు అబ్దుల్‌ ఖాదర్‌ ముజాహిద్, జగిత్యాల ముస్లిం సెంట్రల్‌ కమిటీ అధ్యక్షుడు అమీన్‌ ఉద్దీన్, రియాజుద్దీన్, రియాజ్‌ఖాన్, జామియా ఉల్మా అధ్యక్షుడు ఉమర్‌ అలీ బేగ్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు