కాంగ్రెస్‌ అభ్యర్థుల ఖర్చు కేసీఆరే ఇస్తున్నారు

11 Nov, 2023 05:23 IST|Sakshi

కేసీఆర్‌ మళ్లీ వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నెలలకోసారి జీతాలు

సిర్పూర్‌ సభ, సిరిసిల్ల ర్యాలీల్లో బండి సంజయ్‌ 

సిర్పూర్‌(టి)/కౌటాల, సిరిసిల్ల: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆరే పెడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచినా బీఆర్‌ఎస్‌లోకి వెళ్తారని చెప్పారు. బీఆర్‌ఎస్‌లోని పలువురు అభ్యర్థులను ఓడించేది కూడా కేసీఆరేనని అని తీవ్ర ఆరోపణలు చేశారు.

కుమురంభీం జిల్లా సిర్పూర్‌(టి)లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబుకు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన విజయ సంకల్ప సభలో సంజయ్‌ మాట్లాడారు. కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నెలలకోసారి జీతాలిస్తారని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ ఇటీవల ఫాంహౌస్‌లో చేసింది రాజశ్యామల యాగం కాదని.. వశీకరణ పూజలు చేశారని ఆరోపించారు. 

బీసీని సీఎం చేస్తామంటే ఓర్వలేకపోతున్నారు. 
బీజేపీ ఈ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటే బీఆర్‌ఎస్‌ ఓర్వలేకపోతోందని బండి సంజయ్‌ అన్నారు. కులం కంటే గుణం ముఖ్యమని కేసీఆర్‌ అంటూ బీసీలను అవమానిస్తున్నడని.. వాళ్లు సీఎం పదవికి పనికిరారా.. అని ప్రశ్నించారు. సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థిగా రాణీరుద్రమ శుక్రవారం నామినేషన్‌ వేయగా.. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. బీజేపీ రాష్ట్రంలో లేదని అహంకారంతో బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతున్నారని.. కానీ పార్టీ ప్రజల గుండెల్లో ఉందని సంజయ్‌ వ్యాఖ్యానించారు. బీజేపీకి అవకాశమిస్తే ఎలాంటి మచ్చ లేని పేద బీసీ నాయకుడు సీఎం అవుతారని స్పష్టం చేశారు.  ఈ సందర్భంగా కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు