కాంగ్రెస్‌ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదు

2 Apr, 2019 04:56 IST|Sakshi

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు  

పాపన్నపేట(మెదక్‌)/మెదక్‌ మున్సిపాలిటీ: కాంగ్రెస్‌ .. గల్లీలో లేదు. ఢిల్లీలో లేదు.. అలాంటి పార్టీకి ఓటేస్తే పనికి రాకుండా పోతుంది’అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన మెదక్‌ జిల్లా పాపన్నపేటలో నిర్వహించిన రోడ్‌షోలో టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి పాల్గొన్నారు. మెదక్‌ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలో ఉన్న రైతు ఆత్మహత్యలు ఇప్పుడున్నాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పార్టీలో లీడర్లు ఎక్కువ.. కార్యకర్తలు తక్కువ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో అవినీతి పేరుకు పోయిందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పథకాలను అటు మోదీ.. ఇటు చంద్రబాబు, మరోవైపు మమతా బెనర్జీ కాపీ కొడుతున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు రెండు కళ్ల లాంటివని పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్పంచ్‌ నుంచి ముఖ్యమంత్రి దాకా మనమే ఉన్నామని, ఢిల్లీలో కాంగ్రెస్‌పార్టీ వచ్చేది లేదు.. సచ్చేది లేదని అన్నారు. రాహుల్‌ గాంధీ ప్రచారానికి వస్తే సభల్లో కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయన్నారు. బీజేపీ పువ్వు వాసన అసలే లేదన్నారు. ఈ కార్యక్రమాల్లో కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు