వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే.. భయపడేది లేదు: పొంగులేటి

9 Nov, 2023 20:01 IST|Sakshi

సాక్షి, ఖమ్మం​: పొంగులేటి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఐటీ దాడులకు నిరసనగా కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పొంగులేటి అనుచరుడు ఉపేందర్‌ ఆయన ఇంటి ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కాగా, ఉదయం 5 గంటల నుండి పొంగులేటి నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పొంగులేటికి మద్దతుగా అభిమానులు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. పొంగులేటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధిస్తున్నాయంటూ నిరసన తెలిపారు.

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఉద్దేశపూర్వకంగానే ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి జరిగిన పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు. నేను ఇవాళ నామినేషన్‌ వేస్తున్నానని తెలిసే ఐటీ దాడులు జరిగాయి. కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఇళ్లపైనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారు’’ అంటూ పొంగులేటి వ్యాఖ్యానించారు.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కనుసైగల్లో వ్యవస్థలు నడుస్తున్నాయి. ఎన్నికలకు ఈ రోజు నామినేషన్ వేస్తున్నానని ప్రకటించాను. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి నా ఇళ్లు, బంధువుల ఇళ్లపై, సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నా బంధువులు, మిత్రుల 30 మంది ఇళ్లపై 400మంది అధికారులు దాడులు చేస్తున్నారు. నారాయణపురంలోని మా తల్లి ఉంటున్న ఇంట్లోనూ సోదాలు జరిపారు. కనీసం లక్ష రూపాయలు కూడా పట్టుకోలేకపోయారు. నా దగ్గర పని చేస్తున్న ఉద్యోగులు, బంధువులపై మాన్ హ్యండలింగ్ చేశారు. నా భార్యను, కుమారుడిని వాళ్ల ఆఫీస్‌కి తీసుకెళ్లారు. నన్ను ఈ రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లవద్దని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లపై సోదాలు ఎందుకు జరగట్లేదు?. ఈ పరిణామాలను ప్రజలంతా గమనించాలి. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే.. భయపడేది లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వేస్తే బీఆర్‌ఎస్‌ దోచుకున్న లక్షల కోట్లు కక్కిస్తాం’’ అని పొంగులేటి పేర్కొన్నారు.
చదవండి: ఇదేందయ్యా... ఒక్క సీటు మురిపెం 

మరిన్ని వార్తలు