బీకేకు అసమ్మతి సెగ

8 Mar, 2019 12:22 IST|Sakshi
ఎమ్మెల్యే బీకే.పార్థసారథి

టిక్కెట్‌ ఇవ్వొద్దంటున్న వ్యతిరేకవర్గం

అధినేత ఎదుట నిరసన స్వరం

కాదు..కూడదంటే ఓడిస్తామని వెల్లడి

తాజా పరిణామాలపై సర్వత్రా చర్చ  

పెనుకొండ: టీడీపీలో అసమ్మతి సెగ తారస్థాయికి చేరుకుంది. ఇప్పటికే మంత్రి కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరిలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులే ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి టికెట్‌ ఇవ్వొద్దంటూ పెనుకొండకు చెందిన ముఖ్య నాయకులు కొందరు ఏకంగా సీఎం చంద్రబాబు వద్దే తమ అసంతృప్తిని వెళ్లగక్కినట్లు టీడీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేడోరేపో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిలో సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తున్నారు. ఇందులో ఎమ్మెల్యే పార్థసారథి సైతం టికెట్‌ దక్కించుకున్నట్లు చెబుతున్నారు.

అయితే ఈ సమావేశానికి ముందే రాజధానికి చేరుకున్న పలువురు అసమ్మతినేతలు ఎమ్మెల్యే బీకేకు టికెట్‌ ఇవ్వరాదని పెద్దఎత్తున రచ్చచేసినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే బీకే గెలిచినప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి, అవినీతి, అక్రమాలు, ఏకపక్ష ధోరణిపై భగ్గుమంటున్న పెనుకొండ జెడ్పీటీసీ సభ్యుడు నారాయణస్వామి, పరిగి జెడ్పీటీసీ సభ్యుడు సూరి, సీనియర్‌ టీడీపీ నాయకులు జీవీపీ నాయుడు ఇతర నాయకులు టికెట్‌ విషయంలో అడ్డుపడినట్లు సమాచారం. సీఎంకు సన్నిహితంగా ఉన్న మంత్రులు దేవినేని, అచ్చెన్నాయుడు, తదితర మంత్రులను సైతం కలిసిన నాయకులు ఎమ్మెల్యే బీకే వ్యవహారశైలిని వివరించినట్లు తెలిసింది. అయితే సకాలంలో నాయకులు సీఎం వద్దకు చేరే పరిస్థితి లేకపోవడంతో సీఎం ఏకపక్షంగా టికెట్‌ బీకేకు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే  అసమ్మతి నేతల ద్వారా ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న సీఎం మళ్లీ మాట్లాడదాం అంటూ దీనిపై మౌనం వహించినట్లు తెలిసింది. 

రగులుతున్న అసంతృప్తి
నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీకే తీరుపై సీనియర్‌లలో అసంతృప్తి రగులుతోంది.  ఇప్పటికే అనేక మంది టీడీపీ ముఖ్యులు వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ సమక్షంలో వైఎస్సార్‌సీపీ చేరారు. సోమందేపల్లి పట్టణానికి చెందిన ఓ ప్రముఖ చేనేత నాయకుడికి సోమందేపల్లిలో ఎంతో పేరుంది. అలాంటి నాయకుడిని ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరవర్గం తీవ్ర అవమానానికి గురిచేసినట్లు చర్చ జరుగుతోంది. అయితే ఆయన పార్టీలో ఉండటం కంటే బయటికి పోవడమేæ మేలనీ, అతన్ని పెద్దగా పట్టించుకోవద్దంటూ ఎమ్మెల్యే నుంచే ఆదేశాలు అందాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక అదే గ్రామంలో దివంగత జెడ్పీ చైర్మన్‌ బంధువు, బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ మాజీ ఉపసర్పంచ్‌ సైతం ఎమ్మెల్యే వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పరిగి, పెనుకొండ, రొద్దం, గోరంట్ల మండలాల్లో అసమ్మతి నేతలు.. ఎమ్మెల్యే నీడలా నడుస్తూ ఆయన ఓటమిని చూడాలని తహతహలాడుతున్నారు. ఇక తన సామాజిక వర్గమైన కురుబ కులస్తుల్లో సైతం ఎమ్మెల్యే వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 

విచారంలో ఎంపీ నిమ్మల
బీకే. పార్థసారథికే సీఎం చంద్రబాబు మరోసారి ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు సిద్ధం కావడంతో ఎంపీ నిమ్మల క్రిష్టప్ప తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఐదేళ్లుగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ద్వేషం ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయనకే టికెట్‌ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిన ఎంపీ కిష్టప్ప జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఎలాగైనా పెనుకొండ టికెట్‌ను తనకుమారుడి, లేదా తనకైనా తెచ్చుకోవాలని భావించిన నిమ్మల ఆశలకు గండిపడటంతో దిక్కుతెలియని పరిస్థితిలో ఉన్నారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఇన్నాళ్ళు తాను ఎదుర్కొన్న అవమానాలపై ఎంపీ తన సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏదిఏమైనా ఎమ్మెల్యే బీకే.పార్థసారథి గెలుపు కష్టసాధ్యమేనన్న ప్రచారం జరుగుతోంది. 

మరిన్ని వార్తలు