అనకాపల్లి: జనసేనలో గ్రూప్‌ రాజకీయాలు.. తమ్ముళ్ల సమక్షంలో జనసైనికుల కొట్లాట

15 Nov, 2023 15:33 IST|Sakshi

సాక్షి, అనకాపల్లి: టీడీపీతో పొత్తు మహిమా అని జనసేనలో గ్రూపు రాజకీయాలు బయట పడుతున్నాయి. బుధవారం అనకాపల్లిలో టీడీపీతో జరిగిన సమన్వయ భేటీలో తెలుగు తమ్ముళ్ల సమక్షంలో జనసైనికులు ఘర్షణ పడ్డారు.   

అనకాపల్లి ఉప్పల చంద్రశేఖర్ కళ్యాణ మండపంలో టీడీపీ-జనసేన సమన్వయ భేటీ జరిగింది. ఆ సమయంలో టీం జనసేన(దూలం గోపి), పరచూరి భాస్కరరావు వర్గాల మధ్య చిన్నపాటి వాగ్వాదం.. తర్వాత ఒక్కసారిగా తోపులాట జరిగింది. మాట్లాడే అవకాశం ఇవ్వలేదని పరచూరి భాస్కరరావు వర్గంపై దూలం గోపి వర్గం ఫైర్‌ అయ్యింది. వీళ్లను నిలువరించేందుకు టీడీపీ నేతలు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. మొదటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందని తెలిసి కూడా టీడీపీ నేతలు విడివిడిగా వాళ్లకు ఆహ్వానం అందించినట్లు సమాచారం.

గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనకాపల్లి పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఈ రెండు వర్గాలు తన్నుకున్నాయి. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో అప్పుడు పెద్ద గొడవే జరిగింది. ఈ తరుణంలో గ్రూప్‌ రాజకీయాలకు జనసేనాని పుల్‌స్టాప్‌ పెట్టకపోవడం, అవి ఇప్పుడు తమతో జరుగుతున్న భేటీలో రచ్చకు దారితీయడంతో టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు