కేసీఆర్‌తోనే అభివృద్ధికి బాట

22 Nov, 2018 03:16 IST|Sakshi
శంకరపట్నంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్, చిత్రంలో రసమయి, మంత్రి ఈటల తదితరులు 

మన ఓటు ఢిల్లీకో, అమరావతికో పోనీయొద్దు 

కాంగ్రెస్‌ వస్తే కరెంటుకు కష్టాలే 

కాళేశ్వరంతో కోనసీమగా కరీంనగర్‌ : మంత్రి హరీశ్‌రావు

శంకరపట్నం(మానకొండూర్‌):  సీఎం కేసీఆర్‌ వేలు పట్టుకుని నడిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలంలో బుధవారం టీఆర్‌ఎస్‌ మానకొండూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్‌ ప్రజా ఆశీర్వాద సభకు మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి హరీశ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మీరు రాజీనామా చేయమంటే గడ్డిపోచల్లా భావించి మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు సైతం రాజీనామా చేశామన్నారు.

అయితే అప్పటి మానకొండూర్‌ ఎమ్మెల్యే ఆరెపెల్లి మోహన్‌ మాత్రం కిరణ్‌కుమార్‌రెడ్డితో కుమ్మక్కై రాజీనామా చేయలేదన్నారు. మానకొండూర్‌కు రసమయి రెండోసారి ఎమ్మెల్యే కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గాన్ని సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మిడ్‌మానేర్‌ను మూడేళ్లలో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాళేశ్వరంతో పాత కరీంనగర్‌ జిల్లా మరో కోనసీమగా మారబోతోందన్నారు. ఒకరిపై ఒకరికి నమ్మకం లేని మహాకూటమిలోని నాయకులను ప్రజలు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. పోలవరం కింద మూడో పంటకు గోదావరి నీళ్లు రావని మన కాళేశ్వరాన్ని అడ్డుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. రూ.500 కోట్లతో మానేరు రివర్‌ఫ్రంట్‌ మొదలు పెట్టామన్నారు.

పొరపాటునో, గ్రహపాటునో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇక అర్ధరాత్రి కరెంటే గతి అని, కరెంటుకు కష్టాలు తప్పవని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు కల్యాణలక్ష్మి, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లను రద్దు చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టులను రద్దు ..రద్దు అని అంటున్న కాంగ్రెస్‌ మా కొద్దని ప్రజలు అంటున్నారన్నారు. రైతుల కోసం తీసుకొచ్చిన రైతుబంధు, రైతుబీమా పథకాలను మరింత విస్తరిస్తామని తెలిపారు. కాంగ్రెసోళ్లను గెలిపిస్తే చంద్రబాబు ముందు చేతులు కట్టుకుని నిలబడతారని.. మన ఓటు ఢిల్లీకో.. అమరావతికో పోనీయొద్దని కోరారు.

కోదండరాం వంటి ఉద్యమకారునికి సీటు ఇవ్వకుండా కాంగ్రెస్‌ మోసం చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో తప్పించుకు తిరిగినోళ్లు ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారని మండిపడ్డారు. యాదాద్రి థర్మల్‌ప్లవర్‌ ప్లాంట్‌ను రద్దు చేస్తామని కోమటిరెడ్డి అంటున్నారని.. అందుకే కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. కన్నుకొట్టే రాహుల్‌ను, రెండు కళ్ల సిద్ధాంతం చెప్పే చంద్రబాబును నమ్మవద్దని.. కంటి వెలుగులు పంచే కేసీఆర్‌ వెంట నడవాలని హరీశ్‌ ప్రజలను కోరారు. హుజూరాబాద్‌లో ఈటల.. సిద్దిపేటలో తాను.. సిరిసిల్లలో కేటీర్‌ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని, అలాగే రసమయిని కూడా లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సభలో జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు