సిటీ దంగల్‌

18 Nov, 2018 03:36 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ ‘అభివృద్ధి’ మంత్రం.. అసలేమీ జరగలేదని విపక్షం

‘విశ్వనగర’ నిర్మాణానికి సహకరించాలని అధికార పక్షం ప్రచారం

ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని ‘కూటమి’ ఆరోపణలు

హైదరాబాద్‌ జిల్లాలో ప్రభావం చూపే ‘ట్రాఫిక్, వానకష్టాలు’

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగి.. స్వరాష్ట్రం సిద్ధించాక 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో రాజధాని నగరంలో ఒక్కసీటుకే పరిమితమైన టీఆర్‌ఎస్‌.. ఆ చరిత్రను తిరగరాసేందుకు కంకణం కట్టుకుంది. గత ఎన్నికల్లో హైదరాబాద్‌ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో సికింద్రాబాద్‌లో మాత్రమే గెలిచిన ఆ పార్టీ.. ఇప్పుడు మిత్రపక్ష ఎంఐఎం స్థానాలు పోను మిగతా చోట్ల పాగా వేయాలని భావిస్తోంది. అందుకు నగరాభివృద్ధి, అన్ని వర్గాలకు భద్రమైన జీవనం అనే అంశాలను ప్రచారాస్త్రంగా చేసుకుంటోంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే నగరంలో అందరి ఓట్లూ కీలకమే కావడంతో ఆకట్టుకునే ‘అభివృద్ధి’ వ్యూహాలను పన్నుతోంది. జిల్లాలో అభివృద్ధి అంశమే ఎక్కువ ప్రభావం చూపనుంది. అయితే, ఇచ్చిన హామీల అమలు జాడేదంటూ కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌ కూటమి.. బీజేపీ తమ ఆరోపణలకు పదును పెడుతున్నాయి.

అభివృద్ధి పాట..
నగరంలో రూ.25,000 కోట్ల అంచనాతో ప్రణాళికలు రూపొందించిన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని, ఇవి పూర్తికావాలంటే తమకే పట్టం కట్టాలని టీఆర్‌ఎస్‌ కోరనుంది. విశ్వనగరం దిశగా అడుగులు పడ్డాయని, ఇప్పుడు ప్రభుత్వం మారితే ఆయా ప్రాజెక్టులన్నీ మళ్లీ మొదటికొస్తాయని ప్రచారం చేస్తోంది. 135 కి.మీ. మేర 7 స్కైవేలు, 166 కి.మీ.తో కూడిన 11 మేజర్‌ కారిడార్లు, 348 కి.మీ. మేర 68 ప్రధాన రహదారుల నిర్మాణం, 1400 కి.మీ. మేర ఇతర రహదారులు, 54 ఫ్లైఓవర్లు.. సిటీలో సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణానికి ఇవన్నీ అవసరమని, ఈ పనులన్నీ సాఫీగా సాగితేనే విశ్వనగర కల సాకారమవుతుందని ప్రజల్లోకి వెళ్తోంది. ఇంకా నగరమంతా ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు, స్వచ్ఛ కార్యక్రమాల్లో అవార్డులు, వాణిజ్యప్రాంతాల్లో ఉచితపార్కింగ్‌ వంటి అంశాలనూ ప్రస్తావించనుంది.

మైండ్‌స్పేస్, అయ్యప్ప సొసైటీ, చింతల్‌కుంట అండర్‌పాస్‌లు, కామినేని ఫైలోవర్లతో పాటు ఇటీవలే  ప్రారంభమైన మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ ఫ్లైఓవర్, దాదాపుగా పూర్తయిన కూకట్‌పల్లి రాజీవ్‌గాంధీ జంక్షన్, ఎల్‌బీనగర్‌ల ఫ్లైఓవర్లు్ల, పురోగతిలో ఉన్న దాదాపు 40 వేల డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు, దుర్గంచెరువు కేబుల్‌స్టే బ్రిడ్జి తదితరమైనవి టీఆర్‌ఎస్‌కు సానుకూల అంశాలుగా మారనున్నాయి. ఐటీ అభివృద్ధి.. ఐకియాతో సహా వివిధ అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో శాఖల ఏర్పాటుకు ముందుకు రావడం వంటివి కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. ఇక, వానొస్తే చెరువులయ్యే రహదారులు, పూర్తికాని నాలాల విస్తరణ, నిత్యకృత్యమైన రోడ్ల తవ్వకాలు, స్తంభించిపోయే ట్రాఫిక్‌ వంటి సమస్యలు ప్రతికూలాంశాలుగా మారే అవకాశం ఉంది. ఇవన్నీ విద్యాధిక ఓటర్లను ప్రభావితం చేయనున్నాయని పరిశీలకులు అంటున్నారు. మెట్రో రైలు తమ హయాంలో పూర్తి కావడం.. అంచనాలకు మించి ఆదరణ చూరగొనడంతో ఇది అధికార పక్షానికి పూర్తి సానుకూలాంశం కానుందనే అంచనాలు ఉన్నాయి. 

విపక్షాల మాట..
టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదంటూ ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాయి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని, డల్లాస్‌గా మారుస్తామని చెప్పిన హామీలు ఎంత వరకు నెరవేరాయని ఇవి నిలదీయడానికి సిద్ధమవుతున్నాయి. మూసీ సుందరీకరణ, హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన వంటి వాటిని ప్రజల ముందుంచనున్నాయి. పూర్తికాని లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల హామీని ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకోనున్నాయి. ఇప్పుడున్న సదుపాయాలు, సౌకర్యాలన్నీ గత ప్రభుత్వాల హయాంలో ప్రారంభమైనవేని.. కొత్తగా టీఆర్‌ఎస్‌ చేసిందేమిటని ఇవి ప్రశ్నిస్తున్నాయి. చిన్న వానకే కాలనీలు మునుగుతున్నాయని, రోడ్లు, ట్రాఫిక్‌ సమస్యలు తీరలేదని, హైదరాబాద్‌ స్లమ్‌ఫ్రీ కాలేదని, అవార్డులు, ర్యాంకింగ్‌ల కోసమే స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఉచిత పార్కింగ్‌ అంతటా అమలు కావడం లేదని.. విపక్షాలు గొంతెత్తనున్నాయి. ఐటీ కారిడార్లు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ వంటి సంపన్న ప్రాంతాలనే తప్ప పేదలుండే ప్రాంతాలను పట్టించుకోలేదని, జీఈఎస్‌ వంటి అంతర్జాతీయ సదస్సుల సందర్భంగా విదేశీ ప్రతినిధులను ఆకట్టుకునేందుకు వేసిన అద్దాల రోడ్లు తప్ప పేదల కోసం ఏమీ చేయలేదని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అంటున్నాయి. ఏసీ బస్టాపులు, లూకేఫేలు వంటివి ఎన్నికల దృష్టితో చేసిన మొక్కుబడి కార్యక్రమాలని ప్రచారం చేయనున్నాయి. కొద్ది నెలల క్రితం కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపన చేసిన ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ తదితర పనుల్ని ప్రస్తావిస్తూ.. అది  కేంద్రంలోని తమ పార్టీ చలవేనని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. 

ప్రభావం చూపే అంశాలివే..
- నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య– ట్రాఫిక్‌. ఆఫీసుల సమయం ఏడెనిమిది గంటలైతే.. రెండు మూడు గంటలు ప్రయాణానికి అదనంగా వెచ్చించాల్సి వస్తోందనేది నగరవాసుల ఆవేదన. 
అడుగడుగునా గుంతలు తేలిన రోడ్లు, పార్కింగ్, కాలుష్యం వంటి సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అన్ని పార్టీలు వీటినే ప్రచారాస్త్రాలుగా చేసుకోనున్నాయి. 
నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుకు ఇప్పుడున్న సిటీ బస్సుల స్థానంలో ఆధునిక బస్సులను ప్రవేశపెడతామని ఇటీవలే మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇంకా భద్రమైన నగర జీవనానికి అవసరమైనవన్నీ సమకూరుస్తామని టీఆర్‌ఎస్‌ చెబుతోంటే.. అధికార పార్టీవన్నీ ఆర్భాటపు ప్రకటనలేనని విపక్షాలు ఎలుగెత్తనున్నాయి. 
ఔటర్‌ రింగ్‌రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రోరైలు తదితర ప్రాజెక్టుల్ని ఆయా పార్టీలు తమ ఘనతగానే చెప్పుకునే వీలుంది.
హైదరాబాద్‌ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, పాతబస్తీలోని ఏడు ఎంఐఎంకు కంచుకోటగా ఉన్నాయి. ఈసారి రెండు మూడు నియోజకవర్గాల్లో పరిస్థితి తారుమారయ్యే అవకాశాలున్నాయి.
టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం మిత్రపక్షం. దీంతో మిగతా నియోజకవర్గాల్లోని మైనారిటీ ఓట్లు టీఆర్‌ఎస్‌కు లాభం చేకూర్చనున్నాయి. అలాంటి వాటిల్లో ముషీరాబాద్, అంబర్‌పేట, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌ ఉన్నాయి. 
వివిధ రాష్ట్రాలు, నగరాల నుంచి వలసవచ్చి స్థిరపడినవారు గోషామహల్, అంబర్‌పేట, కంటోన్మెంట్‌ నియోజకవర్గాల్లో ప్రభావం చూపనున్నారు. 
...:: సీహెచ్‌. వెంకటేశ్‌

తొలి మహిళా మంత్రి హైదరాబాదీ
పరదా ధరించే సంప్రదాయం.. మగవాళ్ల మధ్యలోకి రావద్దంటూ ఆంక్షలు..ఆపై రజాకార్ల ఆగడాలు.. ఇంతటి ఆంక్షల చట్రంలోనూ ఉన్నత చదువులు పూర్తిచేసి, సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు మాసుమా బేగం! హైదరాబాదీ అయిన మాసుమా బేగం చిన్నప్పట్నుంచే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తల్లి ద్వారా సరోజిని నాయుడుతో పరిచయం ఏర్పడింది. 1928లో బొంబాయిలో తొలిసారిగా నిర్వహించిన మహిళా సదస్సులో పాల్గొన్నారు. హైదరాబాద్‌ స్టేట్‌లో 1952లో జరిగిన ఎన్నికల్లో శాలిబండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకంగా వ్యవహరించిన కమ్యూనిస్టు యోధుడు మఖ్దూం మొహియుద్దీన్‌పై 780 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు. మొహియుద్దీన్‌ పీడీఎఫ్‌ టికెట్‌పై.. మాసుమా బేగం కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేశారు. హైదరాబాద్‌ రాష్ట్రానికి  బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాసుమా బేగం డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా పని చేశారు. ఆంధ్ర, హైదరాబాద్‌ రాష్ట్రాల విలీనం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో ఫత్తర్‌గట్టి నుంచి శాసనసభ్యురాలిగా విజయం సాధించారు. 1960లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రభుత్వంలోనూ మాసుమా బేగం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 

తొలి తరమంతా.. మహామహులే!
నగర రాజకీయాల్లోని తొలితరం నాయకులంతా ఉన్నత విద్యావంతులే. ఆయా రంగాల్లో నిష్ణాతులుగా పేరొందిన వారే నాడు రాజకీయాల్లోకి వచ్చి నిస్వార్థ ప్రజాసేవకు పూనుకున్నారు. హైదరాబాద్‌ స్టేట్‌కు 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ముషీరాబాద్‌ నుంచి ప్రముఖ వైద్యులు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్‌మెడల్‌ సాధించిన జీఎస్‌ మెల్కొటే విజయం సాధించగా, చాదర్‌ఘాట్‌ నుంచి ప్రముఖ న్యాయ కోవిదుడు గోపాలరావు ఎక్బోటే ఎన్నికయ్యారు. అనంతరం.. ఎగ్బోటే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. బేగంబజారు నుంచి ప్రముఖ న్యాయవాది కాశీనాథ్‌రావు వైద్య విజయం సాధించగా, సోమాజిగూడ నుంచి నిజాం ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో కీలక బాధ్యతలు చూసిన మెహిదీ నవాజ్‌ జంగ్‌ విజయం సాధించారు. ఫత్తర్‌గట్టి నుంచి సంఘసేవకురాలు మాసుమా బేగం తొలి ఎన్నికలోనే భారీ మెజారిటీతో గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. ఉమ్మడి ఏపీలో కూడా వీరిలో కొందరు వివిధ మంత్రివర్గాల్లోనూ పనిచేశారు. 

మరిన్ని వార్తలు