కలవగానే విడదీయాలి!

2 Oct, 2018 01:02 IST|Sakshi

మహాకూటమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ రాజకీయం 

సాక్షి, హైదరాబాద్‌ : అధికారంలో ఉన్నప్పుడు ఆపరేషన్‌ ఆకర్షతో ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి... ముందస్తు ఎన్నికల గెలుపు విషయంలోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏర్పాటు చేస్తున్న మహా కూటమిని ఆధారంగా చేసుకుని... అందులోని పార్టీలను దెబ్బతీసే వ్యూహాన్ని రచించింది. కూటమిలోని పార్టీల్లో సీట్ల సర్దుబాటుతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని నేతల్లో వీలైనంత ఎక్కువ మందిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు ప్రణాళిక రచిస్తోంది. కూటమి ఏర్పడి, పార్టీల వారీగా పోటీ చేసే సీట్ల విషయంలో అధికారిక ప్రకటన రాగానే వ్యూహాన్ని వేగంగా అమలు చేయాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయించింది. ఆయా పార్టీల్లో అసంతృప్తితో ఉండే నేతలతో చర్చలు జరిపే బాధ్యతను టీఆర్‌ఎస్‌లోని కొందరు నేతలకు అప్పగించింది. ప్రధానంగా కాంగ్రెస్‌లో పోటీ చేసే అవకాశం రాని నేతలపై దృష్టి సారించింది. పొత్తులతో మెజారిటీ సీట్లలో విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్న మహాకూటమిని అదే అంశంతో చిత్తు చేయాలని టీఆర్‌ఎస్‌ కసరత్తు తీవ్రం చేసింది. 

సీట్ల సంఖ్యపై స్పష్టత రాగానే... 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ కలసి మహాకూటమిగా ఏర్పడేందుకు అంతా సిద్ధమైంది. పార్టీల వారీగా పోటీ చేసే సీట్ల సంఖ్యను తేల్చే ప్రక్రియ కొనసాగుతోంది. సీట్ల సంఖ్యపై స్పష్టత రాగానే... ఏయే నియోజకవర్గంలో ఏ పార్టీ పోటీ చేయాలనే విషయంలో నిర్ణయం వెలువడనుంది. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. టీడీపీ 25, సీపీఐ 12, టీజేఎస్‌ 33 స్థానాలు అడుగుతున్నాయి. అయితే కాంగ్రెస్‌ మాత్రం టీడీపీకి 10, టీజేఎస్‌ 4, సీపీఐ 3 స్థానాలను ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. పార్టీల వారీగా కేటాయించే సీట్ల సంఖ్యపై చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతానికి నాలుగు పార్టీలు కలసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుఫున పోటీ చేసేందుకు పలువురు నాలుగేళ్లుగా నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఉండే ప్రతికూల పరిస్థితులను తట్టుకుని పోటీకి సిద్ధమవుతున్నారు. ఇలాంటి తరుణంలో మిత్రపక్ష పార్టీలకు స్థానాలకు కేటాయించే స్థానాల్లో కాంగ్రెస్‌ ఆశావహులకు అవకాశం రాదు. కాంగ్రెస్‌ లెక్కల ప్రకారమే మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలు 17 వరకు ఉండనున్నాయి. కూటమిలోని పార్టీలు డిమాండ్‌ చేస్తే కాంగ్రెస్‌ వదులుకునే సీట్లు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేసే అవకాశం రాని కాంగ్రెస్‌ నేతల సంఖ్య పెరుగుతుంది. ఇలాంటి నేతలతో చర్చలు జరిపే ప్రక్రియను అధికార పార్టీ మొదలుపెట్టింది. పలువురు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేతలు ఇప్పటి నుంచే ఇలాంటి నియోజకవర్గాల నేతలతో చర్చలు జరుపుతున్నారు.  

అసంతృప్త నేతలను స్వయంగా కలసి... 
టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని... ప్రభుత్వ పరంగా పదవులు, ఇతర అవకాశాల్లో ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇస్తున్నారు. కూటమిలో పార్టీల వారీగా సీట్లు ఖరారైన రోజే... అసంతృప్త నేతలను స్వయంగా కలసి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించేందుకు వీరంతా సిద్ధమయ్యారు. అసంతృప్త నేతలను కలసి అక్కడి నుంచే టీఆర్‌ఎస్‌ అధిష్టానం ముఖ్యులతో ఫోన్‌లో మాట్లాడించడం, వెంటనే పార్టీలో చేర్పించడం జరిగిపోయేలా ప్రణాళిక సిద్ధమైంది. మరోవైపు టీడీపీకి కొంత ఓటు బ్యాంకు ఉందని భావిస్తున్న నియోజకవర్గాల్లోని నేతలతోనూ టీఆర్‌ఎస్‌ ముఖ్యులు చర్చలు జరుపుతున్నారు. పొత్తులతో పోటీ చేసే అవకాశం రాకపోతే వెంటనే వీరు పార్టీ మారేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తోంది.  

ఎక్కువగా కాంగ్రెస్‌ వారే... 
మహాకూటమిలో పొత్తులో భాగంగా ఎక్కువగా కాంగ్రెస్‌ వారే పోటీ చేసే అవకాశం కోల్పోనున్నారు. సత్తుపల్లి, ఖమ్మం, అశ్వారావుపేట, మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ రూరల్, ఆర్మూరు/బాల్కొండ, ఉప్పల్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ముషీరాబాద్, కోదాడ, కంటోన్మెంట్, సికింద్రాబాద్, పరకాల నియోజకవర్గాలను ఇవ్వాలని టీడీపీ గట్టిగా కోరుతోంది. మల్కాజ్‌గిరి, తాండూరు, మంచిర్యాల, చెన్నూరు, ముథోల్, వరంగల్‌ పశ్చిమ స్థానాల కోసం టీజేఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం, వైరా స్థానాలను తప్పనిసరిగా ఇవ్వాలని సీపీఐ కోరుతోంది. ఇదే తరహాలో పొత్తు కుదిరితే ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ వారికి పోటీ చేసే అవకాశాలు ఉండవు. దీంతో ఈ సెగ్మెంట్లలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశావహులపై, ద్వితీయ శ్రేణి నేతలపై టీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టింది. 

మరిన్ని వార్తలు