‘కారు’తో రెబెల్స్‌ ఢీ..!

20 Nov, 2018 01:39 IST|Sakshi

8 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ తిరుగుబాటుదారుల పోటీ

మూడు చోట్ల ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున బరిలోకి

మరో రెండు చోట్ల బీఎస్పీ టికెట్‌పై పోటీ

22వ తేదీ వరకే నామినేషన్ల ఉపసంహరణ గడువు

అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు అధిష్టానం కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగుబాట్ల బెడద తప్పడంలేదు. టికెట్లు ఆశించి భంగపడిన పలువురు నేతలు రెబెల్స్‌గా రామగుండం, భూపాలపల్లి, వరంగల్‌ తూర్పు, బెల్లంపల్లి, కోదాడ, మక్తల్, రాజేంద్రనగర్, మహేశ్వరం స్థానాల నుంచి అసెంబ్లీ ఎన్నికలకు బరిలో నిలిచారు. నామినేషన్లు సైతం వేశారు. స్వతంత్రులుగా గెలిచి టీఆర్‌ఎస్‌కే మద్దతు తెలుపుతామంటూ పార్టీలోని ద్వితీయశ్రేణి నేతలు, కేడర్‌ను దగ్గర చేసుకుంటున్నారు. తిరుగుబాటు నేతల్లో ముగ్గురు ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ తరఫున సింహం గుర్తుపై పోటీ చేస్తుండగా మరో ఇద్దరు బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) నుంచి బరిలో దిగారు. మిగిలిన వారు స్వతంత్రులుగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వారిని పోటీ నుంచి తప్పించేందుకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం సంప్రదింపులు జరుపుతోంది. నామినేషన్ల ఉపసంహకరణకు గడువు తక్కువగా ఉండటంతో అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ప్రత్యేకంగా పలువురు నేతలను పంపించింది. 

  • రామగుండం నుంచి టీఆర్‌ఎస్‌ ముఖ్యనేత కోరుకంటి చందర్‌ ఈ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీ తరఫున ఆయన నామినేషన్‌ వేశారు. చందర్‌ 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 
     
  • భూపాలపల్లి నియోజకవర్గంలో టికెట్‌ ఆశించి భంగపడిన గండ్ర సత్యనారాయణరావు కూడా ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచే బరిలో దిగారు. గత ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున ఇదే సెగ్మెంట్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతేడాది ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. 
     
  • వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో తనకు టికెట్‌ దక్కకపోవడంతో ఎర్రబెల్లి ప్రదీప్‌రావు సైతం ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు. 2009లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన కేవలం 3 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. 
     
  • టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం దక్కకపోవడంతో మాజీ మంత్రి జి. వినోద్‌ బెల్లంపల్లి నుంచి బహుజన సమాజ్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేశారు. ఆయన గతంలో చెన్నూరు సెగ్మెంట్‌ నుంచి ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఇదే స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. 
     
  • కోదాడ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి కె. శశిధర్‌రెడ్డి సైతం తిరుగుబాటు అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. మూడు రోజుల క్రితం టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన బొల్లం మల్లయ్య యాదవ్‌కు టీఆర్‌ఎస్‌ అధిష్టానం కోదాడ టికెట్‌ కేటాయించింది. దీంతో శశిధర్‌రెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. 
     
  • స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కకపోవడంతో రాజారపు ప్రతాప్‌ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రతాప్‌ 2012 ఉప ఎన్నికలో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 
     
  • మక్తల్‌లోనూ టీఆర్‌ఎస్‌ నేత ఎం. జలంధర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. గెలిచాక టీఆర్‌ఎస్‌లో చేరుతానంటూ ఆ పార్టీ నేతల సహకారం కోరుతున్నారు. 
     
  • మహేశ్వరంలో టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి కొత్త మనోహర్‌రెడ్డి నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు.
     
  • రాజేంద్రనగర్‌లో టీఆర్‌ఎస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా టి.శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్‌గా ఉన్నారు. 
     
మరిన్ని వార్తలు