రక్తంతో వ్యాపారమా?

27 Aug, 2018 03:27 IST|Sakshi

డెంగీ విజృంభణపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం

సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లాలో రక్తంతో వ్యాపారం జరగడం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డెంగీ విజృంభణను ముఖ్యమంత్రి నియంత్రించలేకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘కృష్ణా జిల్లాలో రక్తపు ప్లేట్‌లెట్ల విషయంలో కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. యూనిట్‌ రక్తానికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు ఉంటున్న చోటే ఇలా జరుగుతోంది. ఈ రాష్ట్రంలో మీ పాలనలో ఏదైనా అదుపులో ఉందా?’ అని ట్వీట్‌ చేశారు. ‘రక్తంతో వ్యాపారం ఇక్కడ ఒక అంశం. రక్తంతో కూడా వ్యాపారమేనా? ఎక్కడున్నారు ముఖ్యమంత్రిగారు? మీ ప్రభుత్వం డెంగీ విజృంభణను ఎందుకు అడ్డుకోలేకపోతోంది?’ అని అందులో ప్రశ్నించారు. 

ఏపీలో ఓడాక అమెరికాలో అధికారం కోసం లోకేశ్‌ ఆలోచిస్తారు
‘2019 ఎన్నికల్లో ఏపీలో ఘోరంగా ఓడిన వెంటనే నారా లోకేశ్‌ నాయుడు తమ పార్టీ అమెరికాలో అధికారంలోకి ఎలా రావాలో ఆలోచిస్తూ ఉంటారు. మరి చంద్రబాబు ఏ దేశానికి అధ్యక్షుడు కావాలనుకుంటారు? ఏ–స్విట్జర్లాండ్, బి–సింగపూర్, సి–మలేషియా, డి–జపాన్‌’ అని విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా మరో ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు