మేడే రోజున సెలవెందుకు : విప్లవ్‌ దేవ్‌

12 Nov, 2018 15:35 IST|Sakshi
విప్లవ్‌ దేవ్‌ (ఫైల్‌ ఫోటో)

ప్రభుత్వ ఉద్యోగులకు మేడే రోజన సెలవు లేదు : త్రిపుర సీఎం

అగార్తల : త్రిపుర సీఎం విప్లవ్‌ దేవ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది కార్మిక సంఘాలు మే1న మేడే దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మేడే సందర్భంగా ప్రపంచ దేశాలు కార్మికులకు, ఉద్యోగులకు సెలవు దినంగా పాటిస్తాయి. విప్లవ్‌ మాత్రం మేడే రోజున ఉద్యోగులకు సెలవు ఎందుకని ప్రశ్నించారు. సోమవారం త్రిపురలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘మేడే రోజున ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఎందుకు ఇవ్వాలి?. మీరేమీ కార్మికులు కాదు. కర్మాగారాలు, ఫ్యాక్టరీలలో పనిచేసే లేబర్స్‌కి మాత్రమే ఆ రోజున సెలవు మంజూరు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు కార్మికులుగా పరిగణించరు. అందుకే ఉద్యోగులకు ఆరోజు సెలవు ఇవ్వడం లేదు’’ అని వ్యాఖ్యానించారు.

తాను రాష్ట్రానికి సీఎంని అని.. కానీ కార్మికుడిని కాదని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఆ రోజున సెలవు దినంగా పాటిస్తాయని, ఈ ఏడాది నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు మేడే రోజున సెలవు ఉండదని విప్లవ్‌ పేర్కొన్నారు. గత వారం త్రిపుర ప్రభుత్వం ప్రకటించిన సెలవుల పట్టికలో మేడేను వర్కింగ్‌ డేగా ప్రకటించడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. కాగా గతంలో ఉన్న సీపీఎం ప్రభుత్వం 1978 నుంచి ప్రతీ ఏటా మేడేను సెలవుదినంగా పాటిస్తోంది. సీఎం నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.  వెట్టి చాకిరికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని గుర్తుచేసుకుంటూ ఆ రోజున కార్మిక దినోత్సవంగా పాటిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు