అబద్ధాల బాబూ.. వంచన ఆపు

8 Aug, 2018 11:10 IST|Sakshi
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలను నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్కటీ నెరవేర్చకపోగా.. ప్రకాశం జిల్లాకు వచ్చిన ప్రతిసారి అబద్ధపు హామీలతో వంచిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు.జిల్లా ప్రజల మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా చంద్రబాబు అబద్ధపు హామీలు ఇవ్వడం ఇప్పటికైనా ఆపాలని సూచించారు. నాలుగేళ్లుగా అధికారంలో ఉన్నా జిల్లాకు ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చావా అంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే వెలిగొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి నీళ్లిస్తానని చెప్పిన చంద్రబాబు నాలుగేళ్లుగా ఎందుకు పూర్తి చేయలేదని బాలినేని నిలదీశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డిసెంబర్‌కు, సంక్రాంతికి నీళ్లంటూ మరోమారు బాబు అబద్ధపు హామీలతో జిల్లా వాసులను వంచించేందుకు సిద్ధపడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాలుగేళ్లుగా వెలిగొండ టన్నెల్‌–1ను మూడున్నర కిలోమీటర్లు మాత్రమే తవ్వారని, ఇంకా మూడున్నర కిలోమీటర్ల పని మిగిలి ఉందన్నారు. రానున్న ఐదు నెలల్లో మిగిలిన పని ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. మూడు నెలలుగా పనులు ఆగిపోయినా పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ఓట్ల కోసం వెలిగొండ నీళ్లిస్తానంటూ మరోమారు జిల్లా వాసులను మోసగించాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు మాయమాటలు జిల్లా ప్రజలందరికీ తెలుసని, ఆయనను నమ్మే పరిస్థితి లేదన్నారు.

మూడేళ్ల క్రితం జిల్లాకు ట్రిపుల్‌ ఐటీ మంజూరైతే ఇప్పటి వరకు భవనాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు తరగతులు నిర్వహించే పరిస్థితి లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల సమయంలో ఆరా>్భటంగా శంఖుస్థాపనలు చేయడాన్ని తప్పుబట్టారు. దొనకొండ, కనిగిరి నిమ్జ్‌లో ఎన్ని పరిశ్రమలు స్థాపించారో చెప్పాలన్నారు. ఇన్నాళ్లూ రామాయపట్నం పోర్టును పట్టించుకోని ముఖ్యమంత్రి ఇప్పుడు పునాది రాయి వేస్తాననడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. విమానాశ్రయం, మైనింగ్‌ యూనివర్శిటీ, జనరల్‌ యూనివర్శిటీ, శిల్పారామం అంటూ వందల సంఖ్యలో హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చకుండా మోసం చేశారని దుయ్యబట్టారు.

 కరువు నివారణ చర్యలేవి?
వరుస కరువుతో జిల్లా వాసులు అల్లాడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పశ్చిమ ప్రకాశంతో పాటు తూర్పు ప్రకాశంలోనూ తాగునీరు అందే పరిస్థితి లేకపోయినా ప్రభుత్వం సాగర్‌ జలాలను విడుదల చేయకపోవడం దారుణమన్నారు. రెండుమూడు రోజుల్లో నీటిని విడుదల చేయకపోతే జిల్లా వాసుల గొంతెండుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కంది, శనగ పంటకు గిట్టుబాటు ధరలు కల్పించలేదని, సుబాబుల్, జామాయిల్‌ కొనేవారే కరువయ్యారని, పొగాకు రైతులదీ అదే పరిస్థితి అని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

ఎన్నికల సమయంలో వచ్చి జిల్లాకు పేపర్‌ మిల్లు అంటూ చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ హయాంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తి చేస్తే మిగిలిన 5 శాతం పనులను నేటికీ పూర్తి చేయలేకపోయారని, ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే రానున్న ఎన్నికల్లో బాబుఅండ్‌కోకు జిల్లా ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

మరిన్ని వార్తలు