ఫిరాయించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోండి 

11 Nov, 2017 15:27 IST|Sakshi

     లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు 

     ప్రతిపక్షం లేకుండా సభ నిర్వహించడం సిగ్గుచేటు 

     ప్యారడైజ్‌ పేపర్లపై జగన్‌ సవాల్‌ ఎందుకు స్వీకరించరు? 

     చంద్రబాబు అవినీతి వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలేదు 

     వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ 

సాక్షి, అమరావతి:  పార్టీ మారిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ శాసనసభ స్పీకర్‌ను డిమాండ్‌ చేశారు. లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని చెప్పారు. ఆయన శనివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షం లేకుండా శాసనసభ నిర్వహించడం సిగ్గుచేటని విమర్శించారు. ఒక పార్టీ గుర్తుపై ఎన్నికై పార్టీ మారాలంటే ముందు రాజీనామా చేయాలని, దీనిపై స్పీకర్‌ చర్యలు తీసుకోవాలని చెప్పారు. కనీసం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తాఖీదులైనా ఇచ్చారా? ఆ ఎమ్మెల్యేల నుంచి వివరణ అయినా తీసుకున్నారా అని స్పీకర్‌ను ప్రశ్నించారు.

అందరూ చూస్తుండగా ఫిరాయింపుదారులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారని, దీనికి స్పీకర్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగానికి లోబడి పని చేస్తానని చెప్పిన స్పీకర్‌ ప్రతిపక్షం రాలేదని కుంటి సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. మన రాష్ట్రంలోనే కాదు 13 రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు ఉన్నాయననడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని తప్పించుకోవాలని చూస్తున్నారని, వెంటనే పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. శాసనసభలో జరుగుతున్న తంతును, చట్టసభలను మీ చుట్టాలుగా మారుస్తున్న వ్యవహారాన్ని ప్రజలు చూస్తున్నారని, చరిత్రలో చరిత్రహీనుడిగా చంద్రబాబు మిగిలిపోతారని హెచ్చరించారు. ఇప్పటికైనా స్పీకర్, ముఖ్యమంత్రి తమ ఆలోచనలను మార్చుకుని రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, చట్టసభలకు ఉన్న గౌరవాన్ని కాపాడాలని కోరారు.  
ఆదాయంపైనే చంద్రబాబు దృష్టి 
ప్యారడైజ్‌ పేపర్ల ఆధారంగా చేసిన ఆరోపణలపై జగన్‌ చేసిన సవాల్‌ను చంద్రబాబు ఎందుకు స్వీకరించడంలేదని బొత్స ప్రశ్నించారు. పనామా పేపర్లలో హెరిటేజ్‌ డైరెక్టర్‌ మెటపర్తి శివరామప్రసాద్‌ పేరు ఉన్న విషయాన్ని మరచిపోయారా? అని విమర్శించారు. ప్రతిపక్ష నేత వల్ల రాష్ట్ర బ్రాండ్‌నేమ్‌ పోతుందని చంద్రబాబు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... చంద్రబాబు అవినీతి వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలేదని విమర్శించారు. ఏ పరిశ్రమైనా ఆ రాష్ట్రంలో ఉన్న వనరులు, తమకు వచ్చే లాభాలను బేరీజు వేసుకుని వస్తాయని, కానీ చంద్రబాబు తనకు ఆదాయం వస్తుందో లేదో చూసుకుంటున్నారని ఆరోపించారు. జాయింట్‌ వెంచర్ల పేరుతో చంద్రబాబు డబ్బులు సంపాదించుకుంటున్నారని చెప్పారు. ఇది కాదని చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించి, వీటిని ఉదాహరణలతో సహా వివరిస్తానన్నారు. జపాన్‌ సంస్థ మకి అసోసియేట్స్‌ రాసిన లేఖను ప్రస్తావిస్తూ... ఒకటి, రెండూ కాదు ఇలాంటివి ఎన్నో ఉన్నాయని చెప్పారు. 

 పార్టీ మారినవారిపై స్పీకర్‌ గంటకో మాట మారుస్తున్నారు

మరిన్ని వార్తలు