ఉసూరుమన్న ప్రజాభిప్రాయ సేకరణ

9 Feb, 2018 12:37 IST|Sakshi
మాట్లాడుతున్న చైర్మన్‌ జి.భవాని ప్రసాద్‌

సమావేశానికి బంద్‌ ఎఫెక్ట్‌

విద్యుత్‌ నియంత్రణ మండలి సమావేశం పేలవం

ఒంగోలు సబర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏ.పి.ఇ.ఆర్‌.సి)గురువారం ఒంగోలులో నిర్వహించిన బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణపై బంధ్‌ ఎఫెక్ట్‌ పడింది. స్థానిక దక్షిణ బైపాస్‌ రోడ్డులోని పాత జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఏ.పి.ఈ.ఆర్‌.సి చైర్మన్‌ జస్టిస్‌ జి.భవాని ప్రసాద్‌ అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని నిర్వహించారు. మండలి సభ్యులు పి.రామ్మోహనరావు, పి.రఘు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీతో పాటు వామపక్ష పార్టీలు బంధ్‌ నిర్వహించాయి. దీంతో ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలు రాక వెలవెల బోయింంది. పట్టుమని పది మంది కూడా విద్యుత్‌ వినియోగదారులు హాజరు కాలేకపోయారు. సమావేశానికి ఏపీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ ఎంఎం.నాయక్, డైరెక్టర్‌ పి.పుల్లారెడ్డి విజయవాడ సీఈ రాజబాపయ్య, కర్నూల్‌ సీఈ పీరయ్య, ప్రకాశం ఎస్‌ఈ ఎన్‌వీఎస్‌.సుబ్బరాజు, నెల్లూరు ఎస్‌ఈ విజయకుమార్‌ రెడ్డి, కర్నూల్‌ ఎస్‌ఈ భార్గవ రాముడు, వినియోగదారుల పరిష్కార వేదిక చైర్‌పర్సన్‌ ఏ.జగదీష్‌ చంద్రరావు, సభ్యులు పాల్‌ సురేంద్ర కుమార్, ఒంగోలు డీఈ కట్టా వెంకటేశ్వరరావు, ఒంగోలు పట్టణ ఏడీఈ పి.వి.వి ప్రసాదుతో పాటు జిల్లాలోని విద్యుత్‌ డీఈలు, ఏడీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యుత్‌ చార్జీల్లో మార్పు లేదు
2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్‌ చార్జీల్లో మార్పు లేదు. 2017–18లో ఉన్న చార్జీలనే అమలు చేస్తున్నాం. రానున్న ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక ఆవశ్యకతగా రూ. 21,429 కోట్లు నిర్ధారించారు. విద్యుత్‌ చార్జీలు సంతృప్తి కరంగానే ఉన్నాయి. దేశంలో కల్లా రాష్ట్రంలోనే విద్యుత్‌ చార్జీలు తక్కువగా ఉన్నాయి. వినియోగదారులపై ఆర్థిక భారాన్ని మోపేదిలేదు. ఆదాయాన్ని, వ్యయాన్ని సమన్వయం చేసుకోవటానికే ఇలాంటి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – జస్టిస్‌ జి.భవానీ ప్రసాదు, ఏ.పి.ఇ.ఆర్‌.సి చైర్మన్‌

రూ. 6,218 కోట్లు సబ్సిడీ రావాల్సి ఉంది
రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్‌ సంస్థలకు రూ. 6,218 కోట్లు సబ్సిడీల రూపంలో రావాల్సి ఉంది. ఈ మేరకు ఏ.పి.ఇ.ఆర్‌.సి చైర్మన్‌కు ప్రతిపాదనలు అందించాం. పాత విద్యుత్‌ చార్జీలే యథావిధిగా ఉంటాయి. విద్యుత్‌ అమ్మకాల ద్వారా ఏ.పి.ఎస్‌.పి.డి.సి.ఎల్‌కు రూ. 14,816 కోట్లు వస్తాయి. అందులో భాగంగా హెచ్‌.డి సర్వీస్‌ల ద్వారా రూ. 457 కోట్లు, ఎల్‌టీ సర్వీస్‌ల ద్వారా రూ. 7,370 కోట్లు వస్తాయి. విద్యుత్‌ కొనుగోళ్ల కోసం రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.16,850 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఒక్క ట్రాన్స్‌కోకు రూ. 930 కోట్లు చెల్లిస్తున్నాం. విద్యుత్‌ ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారాలను వెంటనే వాళ్ల బ్యాంక్‌ ఖాతాల్లో జమచేయాలి. – ఎం.ఎం.నాయక్, ఏ.పి.ఎస్‌.పి.డి.సి.ఎల్‌ సీఎండీ

మరిన్ని వార్తలు