అది మాకు పీడకలలా మారింది: ఆసీస్‌ కెప్టెన్‌

15 Sep, 2019 12:20 IST|Sakshi

లండన్‌: యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్టులో ఇంగ్లండ్‌ గెలవడంతో ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైనీ  సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే ఓటమి పాలయ్యామనే విమర్శలు వినిపించాయి. ప్రధానంగా ఇంగ్లండ్‌ చివరి వరుస ఆటగాడు జాక్‌ లీచ్‌ ఔట్‌పై డీఆర్‌ఎస్‌కు వెళ్లడాన్ని మాజీలు ప్రశ్నించారు. ‘ మా కెప్టెన్‌కు మతిపోయినట్లుంది’ అని ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు ఇయాన్‌ చాపెల్‌ విమర్శంచగా, ‘ అనవసరంగా రివ్యూని వృథా చేసుకున్నాడు’ అని మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌ ధ్వజమెత్తాడు. కాగా, చివరి టెస్టులో కూడా పైనీ డీఆర్‌ఎస్‌లో సక్సెస్‌ సాధించడంలో మరోసారి విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రెండు సార్లు రివ్యూకు వెళ్లినా ఆసీస్‌కు చుక్కెదురైంది.

దీనిపై పైనీ మాట్లాడుతూ.. ‘ డీఆర్‌ఎస్‌కు వెళ్లినా మాకు ప్రతికూల ఫలితమే వస్తుంది. ఎందుకో నాకు తెలీదు. డీఆర్‌ఎస్‌ అనేది మాకు పీడకలలా మారింది. అంపైర్ల నిర్ణయాలకు మనం గౌరవం ఇవ్వాలి. కానీ ఔట్‌ని కచ్చితంగా భావించి రివ్యూకు వెళుతున్నా సక్సెస్‌ కావడం లేదు. నేను ‘అంపైరింగ్‌ స్కూల్‌’లో చేరాలేమో’ అని పైనీ పేర్కొన్నాడు. ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ పైచేయి సాధించింది.  ఇంగ్లండ్‌ ఓవరాల్‌గా 382 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంకా రెండు వికెట్లు చేతిలో ఉండటంతో కనీసం నాలుగు వందల లక్ష్యాన్ని ఆసీస్‌కు నిర్దేశించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ గెలిస్తే సిరీస్‌ను సమంగా ముగుస్తుంది. ఒకవేళ ఆసీస్‌ గెలిస్తే 18 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ గడ్డపై యాషెస్‌ గెలిచినట్లు అవుతుంది.

>
మరిన్ని వార్తలు