‘అనువాదం’ బొమ్మ అదిరింది

10 Dec, 2023 00:12 IST|Sakshi

కథ బాగుందా? బొమ్మ (సినిమా) అనువాదం అయినా తెలుగు ప్రేక్షకులు అదిరిపోయే వసూళ్లు ఇస్తారు. అలా ఈ ఏడాది డబ్బింగ్‌ బొమ్మల వసూళ్లు బాగానే ఉన్నాయి. కొన్ని భారీ వసూళ్లు సాధిస్తే.. కొన్ని ఫర్వాలేదనిపించుకున్నాయి. కొన్ని చిత్రాలు నిరాశపరిచాయి. ఏది ఏమైనా ఈ ఏడాది అనువాదం బొమ్మ అదిరిందనే చెప్పాలి. ఆ విశేషాల్లోకి... 

మాతృక హిట్‌.. అనువాదం ఫట్‌ 
తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో హిట్‌గా నిలిచిన పలు చిత్రాలు తెలుగులో ఫర్వాలేదనిపించుకున్నాయి. కొన్ని మాతృకలో హిట్టయినా, ఇక్కడ ఆశించిన ఫలితం సాధించలేకపోయాయి. విశాల్‌  ‘మార్క్‌ ఆంటోనీ’, అదా శర్మ ‘ది కేరళ స్టోరీ’,  ఎస్‌.జె. సూర్య, రాఘవా లారెన్స్‌ల ‘జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌’, రక్షిత్‌శెట్టి ‘సప్తసాగరాలు దాటి’ రెండు భాగాలు, దుల్కర్‌ సల్మాన్‌ ‘కింగ్‌ ఆఫ్‌ కోత, కార్తీ ‘జపాన్‌’, రాఘవా లారెన్స్‌ ‘చంద్రముఖి 2’, శివ రాజ్‌కుమార్‌ ‘ది ఘోస్ట్‌’, రిషబ్‌ శెట్టి ‘బాయ్స్‌ హాస్టల్‌’, పూ రాము, కాళీ వెంకట్‌ కీలక పాత్రల్లో నటించిన ‘దీపావళి’ వంటి చిత్రాలు మాతృకలో ఫర్వాలేదనిపించినా తెలుగులో ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణపోందలేకపోయాయి. సల్మాన్‌ ఖాన్‌ ‘టైగర్‌ 3’, టైగర్‌ ష్రాఫ్‌ ‘గణపథ్‌’, వంటి హిందీ చిత్రాలు తెలుగులో హిట్‌ టాక్‌ని సొంతం చేసుకోలేక పోయాయి. 

జైలర్‌
రజనీకాంత్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఇటీవల ఆశించిన విజయాలు ఇవ్వకుండా ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరిచిన ఆయన ‘జైలర్‌’తో మళ్లీ హిట్‌ ట్రాక్‌లోకి వచ్చేశారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్, రమ్యకృష్ణ జోడీగా నటించారు. ఈ మూవీలో జైలర్‌ ముత్తువేల్‌ పాండ్యన్‌గా రజనీ నటించారు. కళానిధి మారన్‌ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్‌ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్‌కుమార్‌ వంటి స్టార్స్‌ అతిథి పాత్రల్లో అలరించారు. తెలుగు, తమిళ భాషల్లో ‘జైలర్‌’ సూపర్‌ హిట్‌.

వారసుడు.. లియో
విజయ్‌ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘వారిసు’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్, పరమ్‌ వి.పోట్లూరి, పెరల్‌ వి.పోట్లూరి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి రేస్‌లో జనవరి 11న తమిళంలో రిలీజైంది. ‘వారసుడు’ పేరుతో తెలుగులోకి అనువదించి, సంక్రాంతి పోటీలోనే జనవరి 14న రిలీజ్‌ చేశారు. తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగులోనూ హిట్‌గా నిలిచింది. ఇక విజయ్‌ నటించిన మరో చిత్రం ‘లియో’. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ తెలుగులో డబ్‌ చేసి, అక్టోబర్‌ 19నే రిలీజ్‌ చేశారు. తెలుగులో ‘లియో’ టైటిల్‌పై వివాదం చెలరేగినా, ఆ తర్వాత సద్దుమణిగింది. తమిళంలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ‘లియో’ తెలుగులోనూ మంచి వసూళ్లు రాబట్టింది. 

పొన్నియిన్‌ సెల్వన్‌–2 
కల్కి కృష్ణమూర్తి నవలపోన్ని యిన్‌ సెల్వన్‌ ఆధారంగా దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌ 1’. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథ ఇది. విక్రమ్, ఐశ్వర్యా రాయ్, త్రిష, కార్తీ, ‘జయం’ రవి, శోభిత ధూళిపాళ్ల, ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించారు. మణిరత్నం, సుభాస్కరన్‌ నిర్మాతలు. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా తొలి భాగం గత ఏడాది విడుదలై, తమిళ్, తెలుగు భాషల్లో హిట్‌ అయింది. పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ ఈ ఏడాది ఏప్రిల్‌ 28న రిలీజైంది. తెలుగులో నిర్మాత ‘దిల్‌’ రాజు రిలీజ్‌ చేయగా మంచి వసూళ్లు రాబట్టింది.  

పఠాన్‌.. జవాన్‌
‘జీరో’ (2018) సినిమా తర్వాత దాదాపు నాలుగేళ్లు గ్యాప్‌ తీసుకుని షారుఖ్‌ ఖాన్‌ నటించిన చిత్రం ‘పఠాన్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో స్పై యాక్షన్‌ నేపథ్యంలో ఆదిత్యా చో్రపా నిర్మించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి హిందీ సినిమాగా ‘పఠాన్‌’ రికార్డులు సృష్టించింది. తెలుగులోనూ ఈ సినిమా హిట్‌గా నిలిచింది. ఇక షారుక్‌ నటించిన మరో చిత్రం ‘జవాన్‌’ కూడా తెలుగులో ఓకే అనిపించుకుంది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 1200 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. షారుక్‌ నటించిన తాజా చిత్రం ‘డంకీ’ ఈ నెల 21న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా కూడా హిట్‌ అయితే మూడు విజయాలతో షారుక్‌ ఈ ఏడాది హ్యాట్రిక్‌ సాధించినట్లే.

యానిమల్‌  
‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘యానిమల్‌’. రణ్‌బీర్‌ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. భూషణ్‌ కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న రిలీజైంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు రిలీజ్‌ చేశారు. ఈ చిత్రంలోని అడల్ట్‌ కంటెంట్‌పై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ అవేవీ వసూళ్లను ఆపలేకపోయాయి. విడుదలైన రోజు నుంచి ఇప్పటికీ భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. 

బిచ్చగాడు 2 
విజయ్‌ ఆంటోని కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘బిచ్చగాడు’ (‘పిచ్చైకారన్‌’). శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2016లో విడుదలై ఘనవిజయం సాధించింది. తెలుగులో ‘బిచ్చగాడు’గా విడుదలై, బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ‘బిచ్చగాడు’ విడుదలైన ఏడేళ్లకు ఈ ఏడాది ‘బిచ్చగాడు 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్‌ ఆంటోని హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. రిలీజ్‌ రోజున మిక్డ్స్‌ టాక్‌ వచ్చినా, మంచి వసూళ్లు రాబట్టింది.

2018  
కేరళప్రాంతంలో 2018లో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘2018’. టోవినో థామస్, కుంచకో బోబన్, అపర్ణా బాలమురళి, లాల్, ఆసిఫ్‌ అలీ నటించారు. జూడ్‌ ఆంటోని జోసెఫ్‌ దర్శకత్వం వహించారు. వేణు కున్నప్పిళ్లై, సీకే పద్మ కుమార్, ఆంటోని జోసెఫ్‌ నిర్మించిన ఈ సినిమా మే 5న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. రూ. వంద కోట్లు వసూలు చేసిన తొలి మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది. మలయాళంలో విడుదలైన 20 రోజులకే ఈ చిత్రం తెలుగులోనూ ‘2018’ పేరుతోనే అనువాదం అయింది. నిర్మాత ‘బన్నీ’ వాసు తెలుగులో విడుదల చేయగా, ఇక్కడ కూడా హిట్‌గా నిలిచింది. 2018లో కేరళలో వచ్చిన వరదలు, అప్పుడు ప్రజలు పడ్డ ఇబ్బందులు, భావోద్వేగాలను కళ్లకు కట్టినట్లు చూపించారు.

>
మరిన్ని వార్తలు