చెన్నై సూపర్‌ కింగ్సే టాప్‌!

17 Jun, 2018 10:37 IST|Sakshi

లండన్‌: స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం కారణంగా రెండేళ్ల పాటు నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది సీజన్‌లో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగి ఆరంభం నుంచి గొప్ప ప్రదర్శన చేసి ఆఖరికి కప్పు ఎగరేసుకుపోయింది. తద్వారా తన ఐపీఎల్‌ టైటిల్స్‌ సంఖ్యను సీఎస్‌కే మూడుకు పెంచుకుంది.  దాంతో పాటు ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ విలువలో కూడా గణనీయమైన వృద్ధి నమోదు చేసింది.

ఈ ఏడాది చెన్నై సూపర్‌కింగ్స్‌ బ్రాండ్‌ విలువ రూ. 445కోట్లకు పైగా చేరుకుంది. దాంతో ఇప్పటివరకూ ఐపీఎల్‌లో అత్యంత విలువైన బ్రాండ్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను  చెన్నై సూపర్‌కింగ్స్ అధిగమించింది. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.425కోట్ల బ్రాండ్‌ వాల్యూతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక మూడో స్థానంలో రూ. 370 కోట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఉండగా, తర్వాత స్థానాల్లో ముంబై ఇండియన్స్‌ ఆర్సీబీ, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌లు ఉన్నాయి.  ఈ మేరకు లండన్‌కు చెందిన వాల్యుయేషన్ కంపెనీ బ్రాండ్ ఫినాన్స్ ఒక నివేదికను విడుదల చేసింది. 2010, 2013లో బ్రాండ్ విలువలో అగ్రస్థానంలో నిలిచిన చెన్నై... ఈ ఏడాది కూడా మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.
 
మరొకవైపు ఐపీఎల్ బ్రాండ్ విలువ 5.3 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. లీగ్ ఆరంభంలో ఐపీఎల్ విలువ 3 బిలియన్ డాలర్లు ఉండగా, అది క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఇక పదకొండో సీజన్‌లో ఐపీఎల్‌ బ్రాండ్ విలువ 37శాతం పెరిగినట్లు సదరు కంపెనీ తెలిపింది.

>
మరిన్ని వార్తలు