500 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా..

28 Feb, 2019 10:32 IST|Sakshi

సెయింట్‌ జార్జియా: వెస్టిండీస్‌ స్టార్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ మరో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గో వన్డేలో గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 419 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గేల్‌ విజృంభించి ఆడాడు. 97 బంతుల్లో 11 ఫోర్లు, 14 సిక్సర్లతో 162 పరుగులు సాధించాడు. గేల్‌ తన బ్యాటింగ్‌లో పవర్‌ చూపించినప్పటికీ భారీ లక్ష్యం కావడంతో జట్టును గెలిపించలేకపోయాడు. గేల్‌కు జతగా డారెన్‌ బ్రేవో(61), కార్లోస్‌ బ్రాత్‌వైట్‌(50), ఆశ్లే నర్స్‌(43)లు రాణించినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్‌ ధాటిగా ఆడి 48 ఓవర్లలో 389 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్‌ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌ ఐదు వికెట్లు సాధించగా, మార్క్‌ వుడ్‌ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది. ఓపెనర్లు అలెక్స్‌ హేల్స్‌ (73 బంతుల్లో 82; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), జానీ బెయిర్‌ స్టో (43 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) వేసిన పునాదిపై వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జాస్‌ బట్లర్‌ (77 బంతుల్లో 150; 13 ఫోర్లు, 12 సిక్స్‌లు), కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (88 బంతుల్లో 103; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) సునామీ ఇన్నింగ్స్‌ ఆడారు.

బట్లర్, మోర్గాన్‌ నాలుగో వికెట్‌కు 204 పరుగులు జోడించారు. మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ మొత్తం 24 సిక్స్‌లతో ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇదే సిరీస్‌ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ నెలకొల్పిన 23 సిక్స్‌ల రికార్డును వారు బద్దలు కొట్టారు. ఈ ఐదు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో ఇంగ్లండ్‌ గెలవగా, రెండో వన్డేలో వెస్టిండీస్‌ విజయం సాధించింది. వర్షం కారణంగా మూడో వన్డే రద్దయ్యింది. ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో వన్డే శనివారం జరుగనుంది.

500 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా..

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 14 సిక్సర్లతో విరుచుకుపడిన గేల్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదు వందలు సిక్సర్‌ కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో షాహిద్‌ ఆఫ్రిది(476 సిక్సర్లు) పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును బ్రేక్‌ చేసిన గేల్‌.. నాల్గో వన్డే ద్వారా ఐదు వందల సిక్సర్ల మార్కును చేరుకున్నాడు. ఇక వన్డే ఫార్మాట్‌లో పది వేల పరుగులను గేల్‌ పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా ఈ ఘనత సాధించిన 14వ ఆటగాడిగా నిలిచాడు. కాగా, వెస్టిండీస్‌ తరఫున బ్రియాన్‌ లారా తర్వాత ఈ మార్కును చేరిన రెండో క్రికెటర్‌గా గేల్‌ గుర్తింపు సాధించాడు.

మరిన్ని వార్తలు