క్రికెట్‌ అభివృద్ధికి కృషిచేస్తాం

4 Sep, 2018 10:35 IST|Sakshi

హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌తో స్టీరింగ్‌ కమిటీ భేటీ  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ ప్లేయర్స్‌ అసోసియేషన్‌  (సీపీఏహెచ్‌) ఏర్పాటుతో క్రికెట్‌ అభివృద్ధికి కృషి చేస్తామని హెచ్‌సీఏ అపెక్స్‌ కమిటీ సభ్యులు, స్టీరింగ్‌ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం అపెక్స్‌ కమిటీ సభ్యులతో నూతనంగా నియమితులైన స్టీరింగ్‌ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీపీఏహెచ్‌ ఏర్పాటుతో పాటు, హెచ్‌ సీఏలో ఉన్న లోపాలు, క్రీడాకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. త్వరలోనే ఎలక్టోరల్‌ అధికారిని నియమించి అతని ఆధ్వర్యంలో సీపీఎహెచ్‌ ఏర్పాటు కోసం ఎలక్షన్స్‌ను నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 9 నుంచి 15వ తేదీ మధ్యలో ఎలక్షన్స్‌ను నిర్వహించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

సీపీఏహెచ్‌ ఏర్పాటయ్యేంత వరకు హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌లో క్రీడాకారుల ప్రాతినిధ్యం ఉండబోదని అన్నారు. ఈ సమావేశంలో అపెక్స్‌ కమిటీ సభ్యుల మధ్యన ఉన్న విభేదాలను పక్కనపెట్టి క్రికెట్‌ అభివృద్ధికి సమష్టిగా కృషిచేస్తామని చెప్పారు. క్రీడాకారులు అయోమయానికి లోనవ్వకుండా నియమ నిబం ధనలు దృష్టిలో పెట్టుకుని అధికారికంగా ఒకే టీమ్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో హెచ్‌సీఏ అపెక్స్‌ కమిటీ సభ్యులైన అనిల్‌ కుమార్, శేష్‌నారాయణ్, మహేందర్, అజ్మల్‌ అసద్, హనుమంతుతో పాటు, స్టీరింగ్‌ కమిటీ సభ్యులు వీవీఎస్‌ లక్ష్మణ్, అజహరుద్దీన్, విద్యా యాదవ్, రజిని వేణుగోపాల్‌ పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు