డేవిడ్ వార్నర్‌కు షాక్!

28 Mar, 2018 12:44 IST|Sakshi
క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ (ఫైల్ ఫొటో)

సాక్షి, హైదరాబాద్: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ప్రధాన సూత్రధారి అని ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై స్వయంగా ఆ బోర్డు అధికారే వ్యాఖ్యలు చేయడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫ్రాంచైజీని ఆలోచనలో పడేసింది. దీంతో వార్నర్‌ను తమ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ బుధవారం ప్రకటించింది. త్వరలో కొత్త కెప్టెన్‌ను నియమించి, అతడి పేరు వెల్లడిస్తామని సన్‌రైజర్స్ సీఈవో కె. షణ్ముగం తెలిపారు. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో సంబంధం ఉన్న వార్నర్ సహచరుడు స్టీవ్ స్మిత్‌ను రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ ఇటీవలే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. అజింక్యా రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.

రాజస్థాన్‌ టీమ్ కెప్టెన్సీ నుంచి స్టీవ్‌ స్మిత్‌ తప్పుకోగానే ఆ వెంటనే అందరి దృష్టి ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌పై పడింది. దీనిపై ఇటీవల సన్ రైజర్స్ టీమ్‌ మెంటర్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ స్పందిస్తూ... వార్నర్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తీసుకునే చర్యలను బట్టి తాము ముందుకు వెళతామని అతను స్పష్టం చేశాడు. అయితే బంతిని టేపుతో ట్యాంపరింగ్ చేయాలన్నది వార్నర్ ఆలోచనే అని, స్మిత్ సూచనలతో బెన్‌క్రాఫ్ట్‌ బంతి ఆకారాన్ని మార్చేందుకు యత్నించాడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విచారణలో తేలింది.

డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకునే చర్యలతో వారికి ఐపీఎల్‌లో అవకాశం ఇవ్వాలా వద్దా అన్నదానిపై నిర్వాహకులతో పాటు బీసీసీఐ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే సీఏ చీఫ్‌ జేమ్స్‌ సదర్లాండ్‌ అధికారిక ప్రకటన కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

>
మరిన్ని వార్తలు