#AusVsPak: పాక్‌ బౌలర్లకు చుక్కలు.. టెస్టులో వార్నర్‌ టీ20 ఇన్నింగ్స్‌! ఆ తప్పిదం వల్ల నో వికెట్‌!

14 Dec, 2023 10:29 IST|Sakshi
పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న వార్నర్‌ (PC: Cricket Australia)

Australia vs Pakistan, 1st Test: పాకిస్తాన్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. పెర్త్‌ వేదికగా గురువారం మొదలైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు ఫీల్డింగ్‌కు దిగిన పాక్‌కు.. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, ఉస్మాన్‌ ఖవాజా ఆరంభం నుంచే చుక్కలు చూపించారు.

ముఖ్యంగా వార్నర్‌ ఆది నుంచే దూకుడుగా ఆడుతూ.. పాకిస్తాన్‌ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ క్రమంలో 41 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు.. ఖవాజా మాత్రం ఆచితూచి ఆడుతూ వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నాడు.

షఫీక్‌ ఆ క్యాచ్‌ జారవిడవడంతో
పాక్‌ అరంగేట్ర పేసర్‌ ఆమిర్‌ జమాల్‌ బౌలింగ్‌లో లైఫ్‌ను సద్వినియోగం చేసుకుంటూ.. వార్నర్‌తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే దిశగా పయనిస్తున్నాడు. కాగా పదహారో ఓవర్‌ ఆరంభంలో ఆమిర్‌ వేసిన బంతిని పుల్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు ఉస్మాన్‌ ఖవాజా.

ఈ క్రమంలో టాప్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి గాల్లోకి లేవగా అబ్దుల్లా షఫీక్‌ క్యాచ్‌ పట్టినట్టే పట్టి జారవిడిచాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న ఖవాజా.. మరోసారి తప్పిదం పునరావృతం చేయలేదు. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆట భోజన విరామ సమయానికి ఆస్ట్రేలియా 25 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 117 పరుగులు చేసింది పటిష్ట స్థితిలో నిలిచింది.

వార్నర్‌ టీ20 తరహా ఇన్నింగ్స్‌.. పాక్‌ బౌలర్లకు చుక్కలే
లంచ్‌ బ్రేక్‌ సమయానికి డేవిడ్‌ వార్నర్‌ టీ20 తరహా ఇన్నింగ్స్‌తో 67 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 72 పరుగులు సాధించగా.. ఉస్మాన్‌ ఖవాజా 84 బంతుల్లో 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోవైపు.. పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది సహా ఇతర బౌలర్లు కనీసం ఒక్క వికెట్‌ అయినా పడగొట్టాలని విఫలయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఖవాజా ఇచ్చిన సిట్టర్‌ను డ్రాప్‌ చేసిన అబ్దుల్లా షఫీక్‌పై ఇప్పటికే ట్రోలింగ్‌ మొదలైంది. ఖవాజా క్యాచ్‌ను అతడు జారవిడిచిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఆస్ట్రేలియాలో పాకిస్తాన్‌కు టెస్టుల్లో చెత్త రికార్డు ఉందన్న విషయం తెలిసిందే. 1995లో కంగారూ గడ్డపై చివరి సారిగా టెస్టు మ్యాచ్‌ నెగ్గిన పాక్‌.. ఇంతవరకు ఒక్కసారి కూడా సిరీస్‌ గెలవలేదు.

చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. విధ్వంసకర ఓపెనర్‌పై వేటు! తిలక్‌కు బై బై?

>
మరిన్ని వార్తలు