సెరెనా సాఫీగా... 

21 Jan, 2020 04:22 IST|Sakshi

ఫెడరర్, జొకోవిచ్‌ కూడా ముందంజ

వీనస్‌కు మళ్లీ షాక్‌ ఇచ్చిన టీనేజర్‌ కోరి గౌఫ్‌

ప్రతికూల పరిస్థితులతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆటగాళ్ల అగచాట్లు

కొన్ని నెలలుగా ‘కంగారూ’ను దహించి వేస్తున్న కార్చిచ్చు సెగ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కూ తగిలింది. దీంతో సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌లు ముందు ఆలస్యంగా ఆరంభమయ్యాయి. ఇది చాలదన్నట్లు తర్వాత వర్షం కూడా ఓ చేయి వేయడంతో కోర్టులు వెలవెలబోయాయి. స్టార్‌ ప్లేయర్లు ఫెడరర్, సెరెనా సాఫీగా తొలిరౌండ్‌ అడ్డంకిని అధిగమించగా... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్, మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ యాష్లే బార్టీ మాత్రం శ్రమించాల్సి వచ్చింది. 

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆట ఆగమయ్యేలా ఉంది. ఏస్‌లు, విన్నర్స్‌లతో హోరెత్తాల్సిన కోర్టుల్లో ఆటగాళ్లు దగ్గు, ఆస్తమాతో విలవిలలాడే పరిస్థితి రావొచ్చు. సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో దిగ్గజ క్రీడాకారులంతా తొలి రౌండ్లో సాఫీగానే ముందంజ వేశారు. కానీ మ్యాచ్‌లే ముందుముందు సాఫీగా సాగవేమో! మహిళల సింగిల్స్‌లో 24వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ వేటలో ఉన్న అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్‌ కేవలం 58 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. సెరెనా 6–0, 6–3తో అనస్తాసియా పొటపొవా (రష్యా)ను ఓడించింది.

గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో సెరెనాకిది 350వ విజయం కావడం విశేషం. సెరెనా మొత్తం తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ నయోమి ఒసాకా (జపాన్‌) 6–2, 6–4తో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన మేరి బౌజ్‌కొవాను ఓడించింది. టాప్‌ సీడ్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 5–7, 6–1, 6–1తో సురెంకొ (ఉక్రెయిన్‌)పై, ఏడో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–1, 6–0తో తన దేశానికే చెందిన సినియకోవాపై, వొజ్నియాకి (డెన్మార్క్‌) 6–1, 6–3తో క్రిస్టీ అన్‌ (అమెరికా)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) 6–3, 6–2, 6–2తో స్టీవ్‌ జాన్సన్‌ (అమెరికా)పై అలవోక విజయం సాధించాడు. రెండో సీడ్, జొకోవిచ్‌ (సెర్బియా) 7–6 (7/5), 6–2, 2–6, 6–1తో జాన్‌ లెనార్డ్‌ స్ట్రఫ్‌ (జర్మనీ)పై శ్రమించి నెగ్గాడు.

కోరి గౌఫ్‌ మళ్లీ... 
అమెరికా వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ వీనస్‌ విలియమ్స్‌ 15 ఏళ్ల టీనేజర్‌ గండాన్ని ఇక్కడా గట్టెక్కలేకపోయింది. అమెరికా యువ క్రీడాకారిణి కోరి గౌఫ్‌ తొలి రౌండ్లో 7–6 (7/5), 6–3తో 39 ఏళ్ల వీనస్‌కు మళ్లీ షాకిచ్చింది. గతేడాది వింబుల్డన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లోనూ గౌఫ్‌ తొలి రౌండ్లోనే వీనస్‌ను కంగుతినిపించింది. ఇప్పుడు ఇక్కడా... అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. 1998లో వీనస్‌ తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడినపుడు కోరి గౌఫ్‌ ఇంకా పుట్టనే లేదు.

ప్రజ్నేశ్‌ మ్యాచ్‌ నేటికి వాయిదా 
భారత టాప్‌ ర్యాంక్‌ టెన్నిస్‌ ఆటగాడు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ మంగళవారానికి వాయిదా పడింది. జపాన్‌ ప్రత్యర్థి తత్సుమా ఇటోతో సోమవారం జరగాల్సిన ఈ మ్యాచ్‌ వర్షం వల్ల నేటికి వాయిదా పడింది. జపాన్‌ ప్లేయర్‌పై గెలిస్తే ప్రపంచ 122వ ర్యాంకర్‌ ప్రజ్నేశ్‌కు రెండో రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్, జొకోవిచ్‌ ఎదురుపడనున్నాడు. క్వాలిఫయర్స్‌లో లక్కీ లూజర్‌గా భారత ఆటగాడు మెయిన్‌ డ్రాలోకి ప్రవేశించాడు.

సవ్యంగా సాగేది అనుమానమే! 
సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు. కార్చిచ్చు దావానలంలా అంతకంతకూ వ్యాపిస్తోంది. పట్టణాలను, నగరాలను పొగ కమ్మేస్తోంది. మంగళవారం కూడా వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లకు వాయిదాలు తప్పవు. అధికారుల నిర్వాకం కూడా ఆటగాళ్లను చిర్రెత్తిస్తోంది. టోర్నీ అధికారుల తీరుపై  ఫెడరర్‌ మండిపడ్డాడు. సరైన సమాచారం ఎవరూ ఇవ్వడం లేదని విమర్శించాడు. దట్టమైన పొగ, ప్రతికూల వాతావరణం వల్ల ఫెడరర్‌ గత వారం ప్రాక్టీస్‌కు దూరమయ్యాడు. క్వాలిఫయింగ్‌లోనే ఈ పరిస్థితి తలెత్తినప్పటికీ అధికారులు సరిగ్గా స్పందించలేదు. స్లోవేనియాకు చెందిన దలీలా జకుపోవిచ్‌ దగ్గుతో ఆడలేక క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ నుంచి రిటైర్డ్‌ హర్ట్‌గా తప్పుకుంది.

ముందు పొగ... తర్వాత వాన... 
అసలే కార్చిచ్చు పొగతో మ్యాచ్‌లు ఆలస్యమయ్యాయంటే... కొన్ని మ్యాచ్‌లు జరిగాయోలేదో ఈసారి వర్షం ముంచెత్తింది. దీంతో కొన్ని కోర్టుల్లో మ్యాచ్‌లే జరగలేదు. షెడ్యూలు ప్రకా రం మొదటి రోజు జరగాల్సిన 64 మ్యాచ్‌ల్లో 18 మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. తొలిరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులతో దిగ్గజ క్రీడాకారులు ఫెడరర్, సెరెనా, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఒసాకా తదితరులు ఇబ్బంది పడ్డారు. వర్షం వల్ల కాసేపు ఫెడరర్‌ కోర్టును వీడాల్సి వచ్చింది. కోర్టు తడిసి పోకుండా స్టేడియం పైకప్పును మూసి వేయించారు.

మరిన్ని వార్తలు