భారత జట్టు దృక్పథం మారింది! 

20 Mar, 2020 02:17 IST|Sakshi

మహిళల హాకీ స్ట్రయికర్‌ నవనీత్‌ కౌర్‌ హర్షం

వచ్చే వారం నుంచి ఒలింపిక్స్‌ సన్నాహకాలు

బెంగళూరు: ఓవైపు కరోనా ధాటికి టోర్నీలు రద్దవడంతో ఆటగాళ్లంతా ఇంటిపట్టునే గడుపుతుండగా... మరోవైపు భారత మహిళల హాకీ జట్టు మాత్రం ఒలింపిక్స్‌ సన్నాహాల కోసం సంసిద్ధమవుతోంది. ఒలింపిక్స్‌ కోసం వచ్చే వారం నుంచి కఠిన శిక్షణలో పాల్గొంటామని భారత స్ట్రయికర్‌ నవనీత్‌ కౌర్‌ తెలిపింది. ఈ మెగా ఈవెంట్‌ కోసం విడుదలైన డ్రాలో భారత్‌ పటిష్ట జట్లయిన నెదర్లాండ్స్, జర్మనీ, బ్రిటన్, దక్షిణాఫ్రికాతో కలిసి గ్రూప్‌ ‘ఎ’లో చోటు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మెరుగైన ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చేలా తమ ఒలింపిక్స్‌ సన్నాహాలు ఉంటాయని కౌర్‌ పేర్కొంది. ‘నెదర్లాండ్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌ కోసం జట్టంతా ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. ఇంతకుముందెన్నడూ మేం నెదర్లాండ్స్‌ను ఎదుర్కోలేదు. పటిష్ట ప్రత్యర్థులను చూసి మేం భయపడట్లేదు. దానికి తగినట్లుగా ప్రాక్టీస్‌ చేయడంపైనే దృష్టి పెట్టాం.

ప్రస్తుతం మేం జిమ్‌లో తేలికపాటి వ్యాయామాలు చేస్తున్నాం. వచ్చే వారం నుంచి ప్రాక్టీస్‌లో తీవ్రత పెంచుతాం’ అని కౌర్‌ చెప్పింది. గత కొంతకాలంగా భారత జట్టు దృక్పథంలో వచ్చిన మార్పు పట్ల ఆమె హర్షం వ్యక్తం చేసింది. ఈ మార్పు చీఫ్‌ కోచ్‌ జోయర్డ్‌ మరీనే కారణంగా వచ్చిందని పేర్కొంది. ‘మా దృక్పథంలో మార్పుకు చాలా అంశాలు దోహదపడ్డాయి. ప్రాధాన్యత గల మ్యాచ్‌ల్ని గెలవడంతో పాటు కోచ్‌ జోయర్డ్‌ మరీనే మా ధోరణిలో మార్పు తెచ్చారు. అయన దూకుడైన ఆటను ఇష్టపడతారు. మేం కూడా దూకుడుగా ఆడగలమనే ఆత్మవిశ్వాసాన్ని ఆయన జట్టులో నింపారు. మ్యాచ్‌లో చివరి విజిల్‌ వరకు పోరాడాలని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. జట్టులో పోరాట పటిమను పెంచారు’ అని కౌర్‌ కోచ్‌పై పొగడ్తల వర్షం కురిపించింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు