ఆధిబన్, నిహాల్‌ నిష్క్రమణ

16 Sep, 2019 03:40 IST|Sakshi

ఖాంటీ మన్‌సిస్క్‌ (రష్యా): ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌ నుంచి భారత గ్రాండ్‌ మాస్టర్లు నిహాల్‌ సరీన్, ఆధిబన్‌ ని్రష్కమించారు. ఆదివారం జరిగిన రెండో రౌండ్‌ టైబ్రేక్‌ పోటీల్లో వీరిద్దరికీ పరాజయం ఎదురైంది. కేరళకు చెందిన 15 ఏళ్ల నిహాల్‌ 1.5–2.5తో ఎల్తాజ్‌ సఫార్లీ (అజర్‌బైజాన్‌) చేతిలో... తమిళనాడుకు చెందిన ఆధిబన్‌ 1.5–2.5తో యు యాంగి (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. శనివారం నిరీ్ణత రెండు గేమ్‌ల తర్వాత స్కోరు 1–1తో సమం కావడంతో విజేతను నిర్ణయించడానికి ఆదివారం టైబ్రేక్‌ గేమ్‌లు నిర్వహించారు. నిహాల్‌తో జరిగిన టైబ్రేక్‌ తొలి గేమ్‌లో ఎల్తాజ్‌ 61 ఎత్తుల్లో గెలిచి... రెండో గేమ్‌ను 25 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆధిబన్‌తో జరిగిన టైబ్రేక్‌ తొలి గేమ్‌లో యు యాంగి 54 ఎత్తుల్లో నెగ్గి... రెండో గేమ్‌ను 40 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. నిహాల్, ఆధిబన్‌ ఓటమితో ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ తరఫున ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ, మహారాష్ట్ర ప్లేయర్‌ విదిత్‌ సంతోష్‌ గుజరాతి మాత్రమే బరిలో మిగిలారు. నేడు జరిగే మూడో రౌండ్‌ తొలి గేమ్‌ల్లో కిరిల్‌ అలెక్‌సీన్‌కో (రష్యా)తో హరికృష్ణ... సో వెస్లీ (అమెరికా)తో విదిత్‌ తలపడతారు.   

>
మరిన్ని వార్తలు