హరికృష్ణకు నిరాశ

24 Jun, 2020 04:41 IST|Sakshi

చెన్నై: చెసేబుల్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణకు నిరాశ ఎదురైంది. గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ దశ గేమ్‌లు ముగిశాక హరికృష్ణ మొత్తం మూడు పాయింట్లతో తన గ్రూప్‌లో చివరిదైన ఆరో స్థానంలో నిలిచి నిష్క్రమించాడు. ఆరో రౌండ్‌లో హరికృష్ణ 47 ఎత్తుల్లో వ్లాదిస్లావ్‌ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. ఏడో రౌండ్‌లో ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)తో గేమ్‌ను 67 ఎత్తుల్లో; ఎనిమిదో రౌండ్‌లో డానిల్‌ దుబోవ్‌ (రష్యా)తో గేమ్‌ను 36 ఎత్తుల్లో; తొమ్మిదో రౌండ్‌లో హికారు నకముర (అమెరికా)తో గేమ్‌ను 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ చివరిదైన పదో రౌండ్‌లో 30 ఎత్తుల్లో అలెగ్జాండర్‌ గ్రిషుక్‌ (రష్యా) చేతిలో ఓటమి పాలయ్యాడు. గ్రూప్‌ ‘ఎ’లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన కార్ల్‌సన్, వ్లాదిస్లావ్, నకముర, గ్రిషుక్‌... గ్రూప్‌ ‘బి’లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన మాక్సిమి లాగ్రేవ్‌ (ఫ్రాన్స్‌), అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌), కరువానా (అమెరికా), లిరెన్‌ డింగ్‌ (చైనా) నాకౌట్‌ దశకు అర్హత సాధించారు.

మరిన్ని వార్తలు