వాళ్లిద్దరూ నాకు ప్రత్యర్థులు కాదు: కుల్దీప్

13 Nov, 2017 12:29 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో భారత క్రికెట్ జట్టులో కీలక పాత్ర పోషిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్ లు. ప్రధాన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు గట్టి పోటీనిస్తూ సత్తా చాటుకుంటున్నారు వీరిద్దరూ. ఈ క్రమంలోనే అశ్విన్, జడేజాల స్థానానికి ఎసరపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన కుల్దీప్ యాదవ్..తమకు అశ్విన్, జడేజాలతో పోటీ ఉందనడం ఎంతమాత్రం సమంజసం కాదన్నాడు. ఒక్కవిషయంలో చెప్పాలంటే అశ్విన్-జడేజాలు తనకు గురువులాంటి వారిని కుల్దీప్ పేర్కొన్నాడు.

'వాళ్లిద్దరూ నాకు ప్రత్యర్థులు కాదు.. గురువులతో సమానం. నా అన్నయ్యలు వంటి వారు కూడా. వారిద్దరి వద్ద నుంచి అనేక సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నా. ముఖ్యంగా వారి వద్ద నుంచి బౌలింగ్ లో ట్రిక్స్ ను తెలుసుకున్నా. అసలు అశ్విన్-జడేజాలను తమతో పోల్చుతూ వార్తలు ఎక్కడ నుంచి వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. ఇటీవల కాలంలో నాతో పాటు చాహల్ కూడా బాగా రాణించాడు. అంతమాత్రాన అశ్విన్-జడేజాలతో మమ్ముల్ని పోల్చడం సరికాదు. నేనైతే ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాను. ఒక స్పిన్నర్ గా అశ్విన్, జడేజాల మార్గదర్శకాల్లోనే పయనిస్తున్నా. మరి అటువంటప్పుడు వారికి నేను పోటీ ఎలా అవుతాను. వాళ్లిద్దరూ నాకు ఎప్పటికీ ప్రత్యర్థులు కాదు..నేను వారికి పోటీని కాదు'అని కుల్దీప్ స్పందించాడు.

>
మరిన్ని వార్తలు