'సిద్దూ ఆడకపోవడంతోనే నాకు చాన్స్‌ వచ్చింది'

2 Apr, 2020 21:24 IST|Sakshi

సచిన్‌ టెండూల్కర్‌ ఓపెనర్‌గా ఎంత సక్సెస్‌ అయ్యాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని కెరీర్‌లో అగ్రభాగం ఓపెనింగ్‌ స్థానంలో ఆడిన విషయం విదితమే. అయితే కెరీర్‌ మొదట్లో పలు మ్యాచ్‌ల్లో మిడిల్‌ ఆర్డర్‌ స్థానంలోనూ సచిన్‌ ఆడాడు. అయితే తాను ఓపెనర్‌గా ప్రమోట్‌ అయిన విషయాన్ని సచిన్‌ తన పర్సనల్‌ యాప్‌ 100 ఎంబి ద్వారా మరోసారి గుర్తుచేశాడు. అప్పటి ఓపెనర్‌ నవజోత్‌ సింగ్‌ సిద్దూ న్యూజిలాండ్‌ పర్యటనలో గాయపడడంతో తనకు ఓపెనర్‌గా ఆడే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో అప్పటి కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌, మేనేజర్‌ అజిత్‌ వాడేకర్‌లకు కూడా స్థానం ఉందంటూ అభిప్రాయపడ్డాడు.

'ఆరోజు మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌కు అని హోటల్‌ నుంచి బయలుదేరాను. అయితే ఓపెనర్‌గా ఆడే అవకాశం వస్తుందని మాత్రం అనుకోలేదు. నేను మైదానంలోకి వెళ్లేసరికి అప్పటికే అజహర్‌, వాడేకర్‌లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్నారు. మెడనొప్పి కారణంగా సిద్ధూ ఈ మ్యాచ్‌లో ఆడడం లేదని, ఓపెనర్‌గా ఎవరిని ఆడిద్దామా అనే ఆలోచనలో ఉన్నారు. ఇంతలో తాను కలగజేసుకొని ఓపెనర్‌గా ఒక అవకాశం ఇవ్వాలని అడిగాను. అయితే నా ఆటతీరుపై నాకు నమ్మకం ఉండడంతో ఓపెనర్‌గా చెలరేగిపోతాననే నమ్మకం ఉండేది. కానీ ఎక్కడో ఓ మూల ఓపెనర్‌గా రాణించగలనా అనే అనుమానం ఉండేది.. ఏది ఏమైనా నా ఆట నేను ఆడుతూనే అటాకింగ్‌ గేమ్‌కు ప్రాధాన్యమివ్వాలని అనుకున్నా' అంటూ తన మనోభావాన్ని వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్‌లో సచిన్‌ 49 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 బౌండరీలు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ఆ తర్వాత సచిన్‌ ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు అధిగమించిన సచిన్‌ వన్డే కెరీర్‌లో 463 మ్యాచులాడి 18426 పరుగులు చేశాడు. కాగా ఇందులో 49 సెంచరీలు, 96 అర్థసెంచరీలు ఉన్నాయి.
(డక్‌వర్త్‌  ‘లూయిస్‌’ కన్నుమూత)


 

మరిన్ని వార్తలు