‘ఆల్‌ ఇంగ్లండ్‌’లో సైనాకు సువర్ణావకాశం: మాజీ కోచ్‌ విమల్‌

30 Jan, 2019 01:42 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ మానసికంగా బలమైన షట్లర్‌ అని ఆమె మాజీ కోచ్‌ విమల్‌ కుమార్‌ కితాబిచ్చారు. ఆమె అంతటి మానసిక స్థయిర్యమున్న షట్లర్‌ భారత్‌లో మరొకరు లేరన్నారు. ప్రపంచ టాప్‌ స్టార్లు తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ), కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)లు గాయాలతో సతమతమవుతున్నారని ఈ నేపథ్యంలో సైనా మార్చిలో జరిగే ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ గెలిచేందుకు ఇదే సువర్ణావకాశమని 2014 నుంచి 2017 వరకు ఆమెకు కోచ్‌గా పని చేసిన విమల్‌ అన్నారు.

‘తాజా ఇండోనేసియా టైటిల్‌ విజయం సైనాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తప్పకుండా ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిపే ఆమె లక్ష్యం కావాలి. మారిన్‌ కోలుకునేందుకు కనీసం ఐదారు నెలల సమయం పడుతుంది. తై జు యింగ్‌ ఇప్పటికే గాయంతో ఆటకు దూరమైంది. దీంతో సైనా, సింధులకు ‘ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌’ గెలిచేందుకు ఇది లక్కీ చాన్స్‌’ అని విమల్‌ అన్నారు. ‘వయసు రీత్యా సైనా ఇపుడు స్మార్ట్‌ శిక్షణపై దృష్టి పెట్టాలి. ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూనే ఆటలో రాణించాలి’ అని వివరించారు.  

మరిన్ని వార్తలు