తుది మెట్టుపై బోల్తా

5 Feb, 2018 04:43 IST|Sakshi

ఇండియా ఓపెన్‌ రన్నరప్‌ సింధు

ఫైనల్లో బీవెన్‌ జాంగ్‌ చేతిలో ఓటమి

న్యూఢిల్లీ: స్వదేశంలో వరుసగా రెండో ఏడాది ఇండియా ఓపెన్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో ఆమె రన్నరప్‌తో సరిపెట్టుకుంది. చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్‌ జాంగ్‌తో జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సింధు 18–21, 21–11, 20–22తో పరాజయం పాలైంది. 69 నిమిషాలపాటు సాగిన ఈ తుది పోరులో సింధు నిర్ణాయక మూడో గేమ్‌లో మ్యాచ్‌ పాయింట్‌ను చేజార్చుకోవడం గమనార్హం. తన కెరీర్‌లో సింధుపై జాంగ్‌కిది వరుసగా రెండో విజయం.

గతేడాది ఇండోనేసియా ఓపెన్‌లోనూ సింధును జాంగ్‌ ఓడించింది. వీరిద్దరు ముఖాముఖిగా ఐదుసార్లు తలపడగా... సింధు మూడుసార్లు, జాంగ్‌ రెండుసార్లు గెలిచారు. ఐదు మ్యాచ్‌లు కూడా మూడు గేమ్‌లపాటు జరగడం విశేషం. విజేతగా నిలిచిన జాంగ్‌కు 26,250 డాలర్లు (రూ. 16 లక్షల 83 వేలు), 9200 ర్యాంకింగ్‌ పాయింట్లు... రన్నరప్‌ సింధుకు 13,300 డాలర్లు (రూ. 8 లక్షల 53 వేలు), 7800 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. చైనాలో జన్మించిన 27 ఏళ్ల బీవెన్‌ జాంగ్‌ 2007 నుంచి 2013 వరకు సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహించింది. 2013 నుంచి అమెరికా తరఫున ఆడుతోంది.
 
క్వార్టర్‌ ఫైనల్‌ మినహా మిగతా మ్యాచ్‌ల్లో అలవోక విజయాలు సాధించిన సింధుకు ఫైనల్లో గట్టిపోటీనే ఎదురైంది. క్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ సైనా నెహ్వాల్‌ను... సెమీస్‌లో ఆరో సీడ్‌ చెయుంగ్‌ ఎన్గాన్‌ (హాంకాంగ్‌)ను ఓడించిన బీవెన్‌ జాంగ్‌ అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించింది. తొలి గేమ్‌లో కీలక దశలో పైచేయి సాధించిన జాంగ్‌ రెండో గేమ్‌లో మాత్రం సింధు ధాటికి తడబడింది. రెండుసార్లు వరుసగా ఆరు పాయింట్లు చొప్పున కోల్పోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్‌ కోసం పోరాడారు. చివర్లో సింధు 20–19తో మ్యాచ్‌ పాయింట్‌ను సంపాదించింది. కానీ ఒత్తిడికి లోనుకాకుండా ఆడిన జాంగ్‌ వరుసగా మూడు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ షి యుకి (చైనా) 21–18, 21–14తో చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)పై గెలిచి విజేతగా నిలిచాడు.   

>
మరిన్ని వార్తలు